IND vs SA
సొంతగడ్డపై భారత్(IND vs SA )కు మరో ఘోరపరాభవం.. స్పిన్ పిచ్ తోనే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరచాలని చేసిన ప్రయత్నం మళ్లీ బెడిసికొట్టింది. అనూహ్యమైన బౌన్స్ , విపరీతంగా టర్న్ అవుతున్న ఈడెన్ పిచ్ పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. 124 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కుప్పకూలారు.
సౌతాఫ్రికా(IND vs SA )చూపిన పోరాట పటిమ కూడా కనబరచలేకపోయారు. ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌటవగా.. భారత్ 189 పరుగులు చేసింది. 30 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో మ్యాచ్ భారత్ దేనని అంతా అనుకున్నారు. పైగా రెండోరోజు ఆటముగిసే సరికి సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి కేవలం 63 పరుగుల ఆధిక్యంలోనే నిలిచింది. దీంతో మూడోరోజు భారత్ సునాాయాసంగా గెలుస్తుందని భావించారు.
అయితే మూడో రోజు తొలి సెషన్ లో సౌతాఫ్రికా(IND vs SA )పోరాడింది. బవుమా మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కీలక బ్యాటర్లను రెండోరోజే పెవిలియన్ కు పంపించిన భారత బౌలర్లను సఫారీ సారథిని మాత్రం ఔట్ చేయలేకపోయారు. ఫలితంగా బవుమా చివరి వరకూ పోరాడి జట్టు ఆధిక్యాన్ని 100 దాటించగలిగాడు. తొలి సెషన్ కొద్దిసేపట్లో ముగుస్తుందనగా సౌతాఫ్రికాను భారత్ ఆలౌట్ చేసింది.
రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 153 పరుగులు చేసింది. తర్వాత 124 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ , రాహుల్, పంత్ , జురెల్ నిరాశపరిచారు. వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి మరోసారి ఆదుకునే ప్రయత్నం చేాశాడు. అయితే అతనికి మిగిలిన బ్యాటర్ల సపోర్ట్ లభించలేదు.
జడేజా కాసేపు నిలిచినా కీలక సమయంలో ఔటయ్యాడు. దీంతో వికెట్లు పడుతున్నా సుందర్, అక్షర్ పటేల్ పోరాడారు. సుందర్ 31 పరుగులకు ఔటైన తర్వాత అక్షర్ పటేల్ భారత్ ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. గిల్ గాయంతో హాస్పిటల్ లో చేరడంతో భారత్ 9 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి వచ్చింది. టెయిలెండర్లు ఒక్కొక్కరుగా ఔట్ అవుతుండడంతో అక్షర్ పటేల్ దూకుడు ప్రదర్శించాడు. కేశవ్ మహారాజ్ వేసిన ఓవర్లో వరుసగా 4 , 6 , 6 బాదిన అక్షర్ పటేల్ వెంటనే ఔటయ్యాడు.
దీంతో భారత్ ఓటమి ఖాయమైంది. సిరాజ్ 9వ వికెట్ గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ కు 93 రన్స్ దగ్గర తెరపడింది. ఫలితంగా సఫారీలు 30 పరుగుల తేడాతో గెలిచారు. సౌతాఫ్రికా భారత్ గడ్డపై 15 ఏళ్ళ తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికా 1-0 ఆధక్యంలో నిలిచింది.
