Ind vs Sa
టెస్ట్ క్రికెట్ (Ind vs Sa)లో భారత జట్టుకు మరో ఘోరపరాభవం.. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్ వాష్ కు గురైన తర్వాత మరోసారి అలాంటి అవమానమే ఎదురైంది. సొంతగడ్డపై సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్ లో సఫారీల టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకున్నారు. అది కూడా సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి మరీ తమ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ హోదాను నిరూపించుకున్నారు. రెండో టెస్టులో ఊహించినట్టుగానే భారత బ్యాటర్లు చివరిరోజు చేతులెత్తేశారు.
కనీస పోరాటం కరువైంది. జడేజా, సాయి సుదర్శన్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్ళారు. రెండు సెషన్లు కూడా మన బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. టెస్ట్ క్రికెట్ లో భారత్ కు ఇదే అతి పెద్ద ఓటమి. సాయి సుదర్శన్ పట్టుదలగా ఆడినా.. జడేజా మినహాయిస్తే మిగిలిన వారెవ్వరూ సపోర్ట్ చేయలేదు.
జడేజా హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు సాయి సుదర్శన్ తో, వాషింగ్టన్ సుందర్ లో భాగస్వామ్యాలు నెలకొల్పి డ్రాగా ముగించేందుకు ప్రయత్నించాడు. కానీ సఫారీ స్పిన్నర్ హర్మర్ మరోసారి భారత్ ను క్రమం తప్పకుండా దెబ్బతీస్తూనే ఉన్నాడు. వరుస వికెట్లు తీస్తూ భారత్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించాడు.
భారత బ్యాటర్లలో జురెల్ 2, పంత్ 13 , వాషింగ్టన్ సుందర్ 16 పరుగులకే ఔటవగా.. అంచనాలు పెట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి డకౌటయ్యాడు. సాయి సుదర్శన్ 139 బంతుల్లో 14 ఓపిగ్గా బ్యాటింగ్ చేసినా ఫలితం లేకపోయింది. జడేజా 54 పరుగులకు వెనుదిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్ 6 వికెట్లు తీయగా.. కేశవ్ మహారాజ్ 1 , ముత్తుసామి 1, యెన్సన్ 1 వికెట్ పడగొట్టారు.
ఈ (Ind vs Sa)మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగుల భారీస్కోర్ చేయగా.. భారత్ కేవలం 201 పరుగులకే ఆలౌటైంది. అయితే ఫాలో ఆన్ ఇవ్వని సఫారీ కెప్టెన్ బవుమా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగాడు. రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 260 పరుగులకు డిక్లేర్ చేయగా.. భారత్ ఇన్నింగ్స్ కు 140 రన్స్ కే తెరపడింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను 2-0తో స్వీప్ చేసి సఫారీలు దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను గెలుచుకున్నారు. రెండు మ్యాచ్ లలోనూ సౌతాఫ్రికా అద్భుతమైన ఆటతీరుతో భారత్ ను చిత్తు చేసింది. కోచ్ గంభీర్ తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్ లో మితిమీరిన ప్రయోగాలు, కెప్టెన్ గిల్ దూరమవడం టీమిండియా ఓటమికి కారణమయ్యాయి.
