IND vs SA: సిరీస్ విజయమా.. సమమా ? అహ్మదాబాద్ చివరి టీ20

IND vs SA: ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2తో సమంగా ముగుస్తుంది. కాగా చివరి టీట్వంటీ(IND vs SA)కి భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

IND vs SA

భారత్, సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్(IND vs SA) చివరి అంకానికి చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఆఖరి టీ ట్వంటీ సిరీస్ ఫలితాన్ని తేల్చబోతోంది. తొలి మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. తర్వాత పుంజుకున్న సఫారీలు సిరీస్ సమం చేశారు. మూడో మ్యాచ్ (IND vs SA)లోనూ దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్ ఆధిక్యాన్ని అందుకుంది. అయితే పొగమంచు కారణంగా నాలుగో టీ ట్వంటీ రద్దవడంతో ఇప్పుడు చివరి మ్యాచ్ పై ఫోకస్ పడింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది.

ఒకవేళ సౌతాఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2తో సమంగా ముగుస్తుంది. కాగా చివరి టీట్వంటీ(IND vs SA)కి భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఓపెనర్ శుభమన్ గిల్ గాయంతో సిరీస్ కు దూరమయ్యాడు. నాలుగో టీ ట్వంటీకి ముందే గిల్ గాయంతో తప్పుకుంటున్నట్టు బీసీసీఐ తెలిపింది. నిజానికి గిల్ తప్పుకున్నాడా లేదా తప్పించారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఈ సిరీస్ లో గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో గిల్ ఆట అనుకున్నంత సూపర్ గా లేదు.

ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్నా టీమిండియా టీ20 టీమ్ లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. మెడనొప్పితో సౌతాఫ్రికా వన్డే , టెస్ట్ సిరీస్ ల నుంచి తప్పుకున్న గిల్ టీ20 సిరీస్ కు ముుందు ఫిట్ నెస్ సాధించాడు. అతని రాకతో సంజూ శాంసన్ బెంచ్ కే పరిమితయ్యాడు. అయితే గిల్ మాత్రం మూడు మ్యాచ్ లలో 32 పరుగులే చేశాడు. దీంతో అతన్ని తప్పించాలన్న డిమాండ్ వినిపించింది. సంజూ లాంటి ఫామ్ లో ఉన్న ప్లేయర్ కు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇప్పుడు గాయం పేరిటే గిల్ ను పక్కన పెట్టారని భావిస్తున్నారు.

IND vs SA

అహ్మదాబాద్ లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్ లో పూర్తిస్థాయి మెరుపులు మెరిపించలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ నుంచి ఇంకా బయటపడలేదు. స్కై ఫిఫ్టీ చేసి దాదాపు ఏడాదిన్నర పైనే అయింది. దీంతో ఈ మ్యాచ్ తోనైనా ఫామ్ అందుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది.

ఎందుకంటే టీ20 ప్రపంచకప్ కు ముందు ఇంకా 6 మ్యాచ్ లో మిగిలున్నాయి. హార్థిక్ పాండ్యా ఫామ్ లో ఉండగా.. దూబే గాడిన పడాలి. జితేశ్ శర్మ ఫినిషర్ రోల్ లో చోటు దక్కించుకుంటుండగా.. బౌలింగ్ లో మార్పులు జరగనున్నాయి. బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అతను వస్తే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అక్షర్ పటేల్ గాయంతో దూరమైన నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ కొనసాగుతాడు.

అర్షదీప్ సింగ్ మాత్రం పూర్తి ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు టెస్ట్ సిరీస్ ను 2-0తో స్వీప్ చేసి సౌతాఫ్రికా వన్డే సిరీస్ లో పరాజయం పాలైంది. ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయితే అహ్మదాబాద్ లో అంచనాలకు మించి రాణిస్తే తప్ప సిరీస్ ను సమం చేసే పరిస్థితి లేదనే చెప్పాలి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version