India Cricket
భారత మహిళల క్రికెట్(India Cricket) లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎన్నో ఏళ్ళుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వన్డే ప్రపంచకప్(India Cricket- world cup) మన సొంతమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీ కలను సాకారం చేసుకుంది.
అసలు ఈ మెగాటోర్నీలో భారత జర్నీ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ముందు వరుసగా రెండు విజయాలు.. ఇంకేముంది భారత్ కు తిరుగులేదు అనుకున్నారు… కట్ చేస్తే.. తర్వాత వరుసగా ఒకటి కాదు రెండు కాదు మూడు పరాజయాలు… సెమీస్ కు వెళ్ళడం కష్టమే… ఇక బ్యాగులు సర్దుకోండి అన్న విమర్శలు… ఇక్కడ నుంచి టీమిండియా అసలైన ఆటను అందరికీ చూపించింది. ముఖ్యంగా డూ ఆర్ డై మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసిన తీరు టోర్నీకే హైలెట్ గా నిలిచింది. ఈ భారీ విజయంతోనే భారత్ కు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. చివరి లీగ్ మ్యాచ్ వర్షంతో రద్దయినప్పటకీ బౌలర్లు బాగానే ప్రాక్టీస్ చేసుకున్నారు.
అయితే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలవడంతో భయపడుతున్నట్టుగానే సెమీస్ లో మన ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా వచ్చింది. లీగ్ స్టేజ్ లో అప్పటికే ఆసీస్ జైత్రయాత్ర మామూలుగా లేదు. ఒక్క ఓటమి లేకుండా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ సెమీస్ లో అడుగుపెట్టింది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్ రౌండర్లు అందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు.
లీగ్ స్టేజ్ లో భారత్ పై కూడా ఓడిపోయే మ్యాచ్ లో గెలిచి తమ ఛాంపియన్ ఆటతీరు అందరికీ రుచి చూపించింది. దీంతో కంగారూలను దాటితే చాలు కప్పు మనకే అని చాలామంది ఫిక్సయ్యారు. కంగారూలను ఓడించడం అంత సులువు కాదన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆసీస్ జట్టు మిగిలిన జట్లలా కాదు విజయం కోసం చివరి వరకూ తీవ్రంగా పోరాడుతుంది. దానికి తగ్గట్టే టాస్ గెలిచిన ఆసీస్ ముందు బ్యాటింగ్ చేయాలని డిసైడ్ కావడం, మన బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకోవడంతో 338 పరుగుల భారీస్కోర్ చేయడంతో ఇక విజయం కష్టమే అనుకున్నారు.
పైగా ప్రతీకా రావల్ ప్లేస్ లో వచ్చిన షెఫాలీ వర్మ 8 పరుగులకే ఔటవడంతో స్మృతి మంధాన కూడా నిరాశపరచడంతో భారత్ ఇక ఇంటికి వెళ్ళడం ఖాయమని అంతా డిసైడయిపోయారు. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్ అద్భుతం చేసింది. రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ లో కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అదరగొట్టేసింది. సెంచరీ బాదేసింది. హర్మన్ ప్రీత్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం, చివర్లో దీప్తి, రిఛా ఘోష్ కూడా దూకుడుగా ఆడడంతో మహిళల క్రికెట్ లో హయ్యెస్ట్ స్కోరును ఛేజ్ చేసింది.
ఈ విజయంతో ఫైనల్ కు చేరిన భారత జట్టు(India Cricket) కప్పు గెలుస్తుందా అన్న డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే గతంలో రెండుసార్లు ఇదే తరహాలో ఫైనల్ కు వచ్చి ట్రోఫీ అందుకోలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం పట్టువదల్లేదు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్న తరహాలో ఆడింది. ఎందుకంటే ప్రత్యర్థి సౌతాఫ్రికా కూడా చిన్న జట్టేమీ కాదు. పైగా ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ , ఆల్ రౌండర్ కాప్ సఫారీ విజయాల్లో కీలకంగా మారిపోయారు. అయితే చక్కని బౌలింగ్, చక్కని ఫీల్డింగ్ తో సఫారీలను కట్టడి చేసిన భారత జట్టు ప్రపంచకప్ అందుకుంది. విచిత్రమేమిటంటే సెమీస్ చేరిన మూడు జట్లపై భారత్ లీగ్ స్టేజ్ లో ఓటమి పాలైంది. కానీ చివరికి ఆసీస్, సౌతాఫ్రికాలను వరుసగా ఓడించి వరల్డ్ కప్ సాధించింది.
