India vs Australia
భారత క్రికెట్ లో ఇప్పుడు అంతా శుభమన్ గిల్ హవానే నడుస్తోంది. మొదట టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న గిల్ ఇప్పుడు వన్డేల్లోనూ సారథిగా ఎంపికయ్యాడు. ఆదివారం నుంచి ఆస్ట్రేలియా(India vs Australia)తో మొదలుకానున్న వన్డే సిరీస్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో గిల్ కు తొలి సవాల్. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్ లో తన కెప్టెన్సీ మార్క్ తో ఈ యువ సారథి ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో అతని కెప్టెన్సీ ఎలా ఉండబోతోందనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒకవిధంగా సారథిగా తొలి సిరీస్ ఆస్ట్రేలియా(India vs Australia)తో ఆడనుండడం గిల్ కు సవాలే. ఎందుకంటే వరల్డ్ క్రికెట్ లో కంగారూలు ఎంత అత్యుత్తమ జట్టో అందరికీ తెలుసు. పైగా వారి సొంతగడ్డపై ఆసీస్ ను ఓడించడం అంత ఈజీ కాదు. ఇలాంటి సవాల్ ను గిల్ తన కెప్టెన్సీతో ఎలా డీల్ చేయబోతున్నాడన్నదే ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇంగ్లాండ్ జట్టుతో పోల్చి చూస్తే సొంతగడ్డపై కంగారూలు చాలా బలంగా ఉంటారు. ముఖ్యంగా వారి బౌలింగ్ లైనప్ ఎంత భీకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నింటికీ మించి వారి సొంత ఫాస్ట్ పిచ్ లపై ఎంతలా రెచ్చిపోతారో కూడా అందరికీ తెలుసు. దీంతో గిల్‌కు ఆసీస్‌తో సిరీస్ ఖచ్చితంగా లిట్మస్ టెస్టుగానే చెప్పాలి. బ్యాటింగ్ విభాగంలో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉండడం గిల్ కు కలిసొచ్చే అంశం. వీరిద్దరూ లేకుండానే ఇంగ్లాండ్ లో భారత్ సత్తా చాటింది.
ఇప్పుడు రోకో ద్వయం జట్టులోకి రావడం జట్టు బలాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. పాత కెప్టెన్ రోహిత్‌తో గిల్ కు మంచి సంబంధాలే ఉండడంతో జట్టు వ్యూహాల్లో ఖచ్చితంగా హిట్‌మ్యాన్ సలహాలు తీసుకుంటాడు. ఈ విషయాన్ని ఇటీవల ప్రెస్‌మీట్‌లో గిల్ స్వయంగా వెల్లడించాడు. దీంతో కెప్టెన్సీ విషయంలో రోహిత్ ఎంకరేజ్ మెంట్ ఖచ్చితంగా ఉంటుంది.
మరోవైపు కెప్టెన్సీ ఒత్తిడి గిల్(India vs Australia) పై అంచగా కనిపించడం లేదు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ తో అది రుజువైంది. కెప్టెన్సీ ఒత్తిడితో వ్యక్తిగత ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను గతంలో చాలామంది ఉన్నారు. కానీ గిల్ దీనికి భిన్నంగా కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో 700కు పైగా పరుగులు చేయడం మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆసీస్ గడ్డపైనా అతను చెలరేగితే గిల్ కు ఇంత తిరుగుండదని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆసీస్‌పై కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడిన గిల్ 280 పరుగులు చేయగా.. దీనిలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఆసీస్ గడ్డపై మాత్రం ఇప్పటి వరకూ ఒకే ఒక వన్డే ఆడిన గిల్ 33 పరుగులే చేశాడు.