INDW vs SLW
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు(INDW vs SLW) జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంక మహిళల జట్టు(INDW vs SLW)పై నాలుగో టీ ట్వంటీలోనూ విజయం సాధించింది. గత మ్యాచ్ లతో పోలిస్తే లంక కాస్త పోటీనిచ్చింది. బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ, స్మృతి మంధాన హాఫ్ సెంచరీలకు తోడు రిఛా ఘోష్ మెరుపులు హైలైట్ గా నిలిచాయి. బౌలింగ్ లో వైష్ణవి శర్మ మ్యాజిక్ తో భారత్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ 2 మార్పులు చేసింది.
జెమీమా, క్రాంతి గౌడ్ ప్లేస్ లో హార్లిన్ డియోల్, అరుందతి రెడ్డిలకు చోటు దక్కింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించారు. లంక బౌలర్లను ఆటాడుకున్నారు. ఫామ్ లో ఉన్న షెఫాలీకి ఈ మ్యాచ్ లో స్మృతి మంధాన కూడా తోడైంది. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ టాప్ గేర్ లో సాగింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 162 పరుగులు జోడించారు. ఈ క్రమంలో షెఫాలీ 30 బంతుల్లోనే ఈ సిరీస్ లో మూడో హాఫ్ సెంచరీ సాధించింది.
అటు తనదైన శైలిలో క్లాసిక్ బ్యాటింగ్ చేసిన మంధాన కూడా 35 బంతుల్లోనే ఫిఫ్టీ బాదింది. ఫలితంగా భారత్ రన్ రేట్ ఓవర్ కు పదికి పైగా సాగింది. షెఫాలీ 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 79 , స్మృతి 48 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసారు.
ఈ మ్యాచ్ లో మంధాన అంతర్జాతీయ క్రికెట్ లో 10 వేల పరుగులు పూర్తి చేసుకుంది. వీరిద్దరూ ఔటైన తర్వాత రిాఛా ఘోష్ సుడిగాని ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 16 బంతుల్లోనే 40 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 221 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.
ఛేజింగ్ లో శ్రీలంక మహిళల (INDW vs SLW)జట్టు కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు హాసిని, ఆటపట్టు తొలి వికెట్ కు 59 పరుగులు జోడించారు. హాసిని 33 రన్స్ కు ఔటైనప్పటకీ.. కెప్టెన్ ఆటపట్టు హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించింది. తర్వాత వన్ డౌన్ బ్యాటర్ దులానీ కూడా ధాటిగా ఆడడంతో లంక ఇన్నింగ్స్ కూడా వేగంగానే సాగింది.
అయితే భారత బౌలర్లు కీలక సమయాల్లో లంక జోరుకు బ్రేక్ వేశారు. వరుస వికెట్లు తీసి వారిని కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక మహిళల జట్టు (INDW vs SLW)20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ 2 వికెట్లు , అరుంధతి రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో చివరి మ్యాచ్ ఇదే వేదికలో మంగళవారం జరుగుతుంది.
