IPL 2026
ఐపీఎల్(IPL 2026).. ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్… యువ క్రికెటర్ల జీవితాలను రాత్రికి రాత్రే మార్చేసిన లీగ్.. బీసీసీఐకి కోట్ల వర్షం కురిపిస్తున్న లీగ్.. ఫ్రాంచైజీలకు, స్పాన్సర్లకు సైతం కాసులు కురిపిస్తున్న లీగ్.. ఇలాంటి లీగ్ లో ఆడాలని ఎవరు మాత్రం అనుకోరు.. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెటర్లందరూ ఐపీఎల్(IPL) లో ఆడేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇక ఆటగాళ్ళ వేలం వస్తుందంటే చాలు రిజిస్టర్ చేసుకుని తాము ఎంత ధర పలుకుతామా అనుకుంటూ ఎదురుచూస్తుంటారు.
అయితే ఈ సారి మినీ వేలం నుంచి పలువురు స్టార్ ప్లేయర్స్ ముందే తప్పుకుంటున్నారు. ఫామ్ లో లేని, వయసు మీద పడిన డుప్లెసిస్, రస్సెల్ వంటి ప్లేయర్స్ వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు. తాజాగా ఈ జాబితాలో ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కూడా చేరాడు. వేలంలో అమ్ముడుపోనని గ్రహించే అతను వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాక్స్ వెల్ పోస్ట్ పెట్టాడు.
క్రికెటర్‌గా ఎదిగేందుకు ఐపీఎల్ (IPL)తనకు ఎంతో ఉపయోగపడిందన్నాడు. ప్రపంచ క్రికెట్ లోని అత్యుత్తమ ప్లేయర్స్ లో ఆడే అవకాశం లభించిందని చెప్పాడు. ఇక ఐపీఎల్ అభిమానుల ప్రేమ ఎప్పటికీ వెల కట్టలేనిదని వ్యాఖ్యానించాడు, ఈ అత్యుత్తమ లీగ్ జ్ఞాపకాలు, సవాళ్లు, భారత అభిమానుల మద్ధతు తనతో శాశ్వతంగా ఉంటాయని పోస్టులో రాసుకొచ్చాడు. మళ్లీ త్వరలో కలుస్తామని ఆశిస్తున్నట్టు మ్యాక్స్‌వెల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఐపీఎల్(IPL 2026) రిటైర్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా అతన్ని ప్లేయర్ గా మళ్ళీ చూసే అవకాశాలు లేనట్టేని పలువురు అంచనా వేస్తున్నారు. త్వరలో జరిగే మినీ వేలంలో తాను అన్ సోల్డ్ గా మిగిలిపోయి అవమానం పొందే కంటే ముందే తప్పుకోవడం మంచిదని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒంటిచేత్తో ఎన్నోసార్లు మ్యాచ్ లు గెలిపించిన మాక్సీ ఐపీఎల్ (IPL)కెరీర్ 2012లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మొదలైంది. తర్వాత 2013లో ముంబై ఇండియన్స్ , 2014-17 వరకూ పంజాబ్ కింగ్స్ కూ , 2018లో మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2020-21లో పంజాబ్ కు తిరిగొచ్చిన ఈ ఆసీస్ ఆల్ రౌండర్ 2021-24 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగూరుకు ఆడాడు.
2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగాడు. 13 ఏళ్ళ కెరీర్ లో 92 కోట్లు సంపాదించిన మాక్స్ వెల్ 141 మ్యాచ్‌లలో 23.88 సగటుతో 2819 రన్స్ చేశాడు. దీనిలో 18 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే గత సీజన్ కు ముందు పంజాబ్ కింగ్స్ మాక్స్ వెల్ ను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేయగా.. అతను పూర్తిగా నిరాశపరిచాడు. 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 48 పరుగులే చేయగలిగాడు. ఈ కారణంగానే పంజాబ్ కింగ్స్ మళ్లీ మాక్స్ వెల్ ను రిటైన్ చేసుకోలేదు.
