Ishan Kishan
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం.. ప్రతీ ఆటగాడి విషయంలోనూ ఇది ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు రుజువవుతూనే ఉంటుంది. తాజాగా వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో ఇద్దరి విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్.. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. ఫామ్ లో లేక, టీ ట్వంటీ ఫార్మాట్ కు తగినట్టు బ్యాటింగ్ చేయలేక గిల్ చోటు కోల్పోతే… దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించి తనను తీసేసిన సెలక్టర్ల చేతనే మళ్లీ పిలిపించుకున్నాడు ఇషాన్ కిషన్… ఇక్కడ గిల్ కంటే కూడా ఇషాన్ కిషన్( Ishan Kishan) రీఎంట్రీ హైలైట్ గా నిలిచింది. ఎందుకంటే ఏడాదిన్నర క్రితం జట్టులో చోటే లేదు.
దేశవాళీ క్రికెట్ లో ఆడమంటే బీసీసీఐ మాటలను పట్టించుకకోపవడంతో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో సైతం పేరు తొలగించారు. ఎక్కడైనా క్రమశిక్షణ ఉంటే ఎదుగుదల ఉంటుంది. అయితే మానసికంగా తాను సిద్ధంగా లేనని చెబుతూ షార్ట్ బ్రేక్ తీసుకున్న ఇషాన్ కిషన్ ( Ishan Kishan)తన కెరీర్ విషయంలో త్వరగానే తప్పులు తెలుసుకున్నాడు. ఎంతో పోటీ ఉండే టీమిండియాలో ప్లేస్ నిలుపుకోవాలంటే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే.. ప్రతీ మ్యాచ్ లోనూ రాణించాల్సిందే. అదే విషయాన్ని త్వరగానే అర్థం చేసుకున్న ఇషాన్ కిషన్ పోయిన చోటే వెతుక్కోవాలనుకుని డిసైడ్ అయ్యాడు.
దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించి ఫామ్ అందుకున్నాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును నడిపించిన ఇషాన్ కిషన్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ ను ఈ సారి ఛాంపియన్ గా నిలిపాడు. గత ఏడాది కాలంగా అప్పుడప్పుడు కొన్ని ఇన్నింగ్స్ లు ఆడినా సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు. అయితే సెంట్రల్ కాంట్రాక్టులో మాత్రం చోటు దక్కింది. ఇంగ్లాండ్ టూర్ లో అవకాశం వస్తుందనుకుంటే గాయంతో అది చేజారింది. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఇషాన్ కిషన్ కు సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఈ టోర్నీ ఆద్యంతం పరుగుల వరద పారిస్తూ దుమ్మురేపాడు. 2 సెంచరీలు బాదడంతో పాటు 517 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఈ ప్రదర్శనతో తనను ఎంపిక చేయడం తప్ప సెలక్టర్లకు మరో ఆప్షన్ లేకుండా చేశాడు. దేశవాళీ క్రికెట్ ప్రదర్శనే కొలమానం అంటూ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ చెబుతున్న గంభీర్ , బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇషాన్ కు పిలుపునిచ్చింది. అది కూడా వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికవడం ఇషాన్( Ishan Kishan) కు గోల్డెన్ ఛాన్స్ గానే చెప్పాలి. ఎందుకంటే తాను ఎక్కడైతే కొన్ని పొరపాట్లు చేసిన జట్టులో నుంచి తీసేసారో అదే జట్టులోకి మళ్లీ వారి చేతనే పిలిపించుకున్నాడు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు మెగాటోర్నీకి ముందు జరిగే కివీస్ తో సిరీస్ ఇషాన్ కిషన్ కు మంచి ఛాన్స్ గా చెప్పొచ్చు. 202లో ఇంగ్లాండ్ పై టీ20 అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ ఇప్పటి వరకూ 32 మ్యాచ్ లు ఆడి 796 పరుగులు చేశాడు. దీనిలో ఆరు హాఫ్ సెంచరీలున్నాయి.
