Team India: కెఎల్ రాహుల్ కే కెప్టెన్సీ పగ్గాలు..  సౌతాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు ఇదే

Team India: రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ లకు చోటు దక్కింది. పంత్ దాదాపు ఏడాది తర్వాత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

Team India

వచ్చే వారం నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు భారత క్రికెట్ జట్టు(Team India)ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అనుకున్నట్టుగానే మెడ నొప్పి నుంచి కోలుకోని శుభమన్ గిల్ ఈ సిరీస్ కు దూరమయ్యాడు. గిల్ రీఎంట్రీకి మరికొన్ని రోజులు పడుతుందని తెలుస్తోంది. దీంతో టీ ట్వంటీ సిరీస్ కు కూడా అతను అందుబాటులో ఉండకపోవచ్చు. వన్డే సిరీస్ కోసం గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా నియమించారు.

తాత్కాలిక సారథ్య బాధ్యతల కోసం పంత్, రోహిత్ , అక్షర్ పటేల్ పేర్లు కూడా వినిపించినా జట్టు (Team India)కోసం ఎప్పుడంటే అప్పుడు తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుంటూ, కీపర్ గానూ రాణిస్తున్న రాహుల్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపారు. ఆస్ట్రేలియా టూర్ లో గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. అయ్యర్ మరో 2-3 నెలల పాటు గ్రౌండ్ లో అడుగుపెట్టే అవకాశం లేదని సమాచారం.

ఆసీస్ పై వన్డే సిరీస్ లో క్యాచ్ అందుకునే క్రమంలో ప్లీహానికి గాయమై అతికష్టం మీద కోలుకున్నాడు. అయితే ఇప్పట్లో క్రికెట్ ఆడేందుకు వైద్యులు అనుమతించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆసీస్ తో వన్డే సిరీస్ ఆడిన జట్టుతో పోలిస్తే పలు మార్పులు జరిగాయి.

రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ లకు చోటు దక్కింది. పంత్ దాదాపు ఏడాది తర్వాత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే టీ ట్వంటీ ఫార్మాట్ లో రెగ్యులర్ ప్లేయర్ గా ఉన్న హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మకు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఆసీస్ తో సిరీస్ కు ఎంపిక కాని రవీంద్ర జడేజా మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఇక సౌతాఫ్రికా ఏ జట్టుపై అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కింది.

Team India

అలాగే బ్యాకప్ వికెట్ కీపర్ గా ధృవ్ జురెల్ తన ప్లేస్ నిలుపుకున్నాడు. తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఎంపికయ్యాడు. పేస్ విభాగం స్టార్ బౌలర్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అర్షదీప్ సింగ్, ప్రసిద్ద కృష్ణ, హర్షిత్ రాణా పేస్ ఎటాక్ లో ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ కు నిరాశే మిగిలింది. జడేజా రీఎంట్రీతో అక్షర్ కు చోటు దక్కలేదు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ చోటు నిలబెట్టుకున్నారు. కాగా నవంబర్ 30 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు వన్డేలకు రాంఛీ , రాయ్ పూర్ , విశాఖపట్నం ఆతిథ్యమివ్వనున్నాయి.

భారత వన్డే జట్టు (Team India)
కేఎల్ రాహుల్ (కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ), రిషబ్ పంత్ ( వైస్ కెప్టెన్ కప్ కీపర్ ), జైస్వాల్ , రోహిత్ శర్మ, కోహ్లీ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, జడేజా, కుల్దీప్ యాదవ్, నితిశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ధృవ్ జురెల్.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version