Microscope
మనం స్మార్ట్‌ఫోన్ కెమెరాతో దూరంగా ఉన్న వస్తువులనూ, మన ముందు ఉన్న మనుషులనో ఫోటోలు తీస్తుంటాం. కానీ మన కంటికి కనిపించని అతి చిన్న ప్రపంచాన్ని కూడా చూడొచ్చని తెలీదు. మామూలుగా ఆకుపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు, పూల రేణువులు, చిన్న పురుగుల రెక్కల మీది డిజైన్లు ఇలాంటివి చూడాలంటే ఖరీదైన మైక్రోస్కోప్(Microscope)లు కానీ మ్యాక్రో లెన్స్‌లు కొనాల్సి ఉంటుంది.
అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను శక్తివంతమైన మైక్రోస్కోప్(Microscope)గా మార్చుకోవచ్చట.దీని కోసం కావాల్సిందల్లా చిన్న పిల్లలు ఆడుకునే ఒక పాత లేజర్ లైట్ ఒకటే. ఈ చిన్న ట్రిక్ ఫోన్ కెమెరా సామర్థ్యాన్ని వంద రెట్లు పెంచుతుందట.
ఒక పాత లేదా పాడైపోయిన లేజర్ లైట్‌ను తీసుకుని.. దాని ముందు భాగంలో ఉండే క్యాప్‌ను జాగ్రత్తగా విప్పితే, లోపల ఒక చిన్న పారదర్శకమైన గాజు బిళ్ల లాంటి లెన్స్ కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ, కాంతిని కేంద్రీకరించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
ఆ లెన్స్‌ను జాగ్రత్తగా బయటకు తీసి, దుమ్ము లేకుండా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఒక హెయిర్ పిన్ కానీ చిన్న సెల్లో టేప్ సహాయంతో కానీ ఆ లెన్స్‌ను మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్ మధ్యలో సరిగ్గా అమర్చాలి. కెమెరాకు ఆ లెన్స్ఎంత దగ్గరగా, ఎంత స్ట్రైట్‌గా ఉంటే ఫోటోలు అంత బాగా వస్తాయి.
ఒక్కసారి ఈ లెన్స్‌ను అమర్చిన తర్వాత ఫోన్ కెమెరా యాప్‌ను ఓపెన్ చేసి చూడాలి. మీరు ఏదైనా వస్తువును చూడాలనుకున్నప్పుడు, ఫోన్‌ను ఆ వస్తువుకు చాలా దగ్గరగా అంటే దాదాపు అర సెంటీమీటర్ దూరం వరకు తీసుకెళ్లాలి. అప్పుడు స్క్రీన్ మీద మీకు అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక ఉప్పు గింజను చూస్తే అది ఒక పెద్ద స్పటికంలా, ఆకును చూస్తే దానిలోని సిరలు ఒక రోడ్డు మ్యాప్‌లా కనిపిస్తాయి. అయితే ఫోకస్ సరిగ్గా కుదరడానికి మీ చేతులు వణకకుండా చూసుకోవడమనేది చాలా ముఖ్యం.
ఇలాంటి చిన్న ప్రయోగాలు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా, టెక్నాలజీని మనం ఎంత క్రియేటివ్‌గా వాడుకోవచ్చో అర్థమయ్యేలా చేస్తాయి. ఖరీదైన పరికరాలు లేవని బాధపడకుండా, అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన ఆవిష్కరణలు చేయొచ్చని నిరూపించడానికి ఇది ఒక ఉదాహరణ.
