Nathan Ellis
టీ20 ప్రపంచకప్ లో అందరికంటే ఆలస్యంగా మొదటి మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా తమ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్ లో ఇంగ్లీస్ , రెన్షా , స్టోయినిస్ మెరుపులు.. బౌలింగ్ లో నాథన్ ఎల్లిస్(Nathan Ellis) సంచలన స్పెల్, ఆడమ్ జంపా స్పిన్ మ్యాజిక్ ఆసీస్ కు అద్భుత విజయాన్ని అందించాయి.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, మాక్స్ వెల్ నిరాశపరిచినా మిగిలిన బ్యాటర్లు రాణించారు. స్టోయినిస్ 45, ఇంగ్లీస్ 37,రెన్షా 37 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ స్కోరు 200 లోపే పరిమితమైంది. ఛేజింగ్ లో ఐర్లాండ్ ను ఆసీస్ బౌలర్లు కంగారెత్తించారు. నాథన్ ఎల్లిస్ అద్భుతమైన పేస్ బౌలింగ్ తో చెలరేగిపోయాడు.
ఫలితంగా ఐర్లాండ్ కేవలం 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. జార్జ్ టాక్రెల్ 41, కీపర్ టక్కర్ 24 తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. వీరిద్దరూ పోరాడడంతో ఐర్లాండ్ స్కోరు కనీసం 100 పరుగులు దాటగలిగింది. నాథన్ ఎల్లిస్ కేవలం 3.5 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐర్లాండ్ 115 పరుగులకే ఆలౌటైంది. టీ ట్వంటీ ప్రపంచకప్ లో 4 వికెట్ల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఐదో బౌలర్ గా నాథన్ ఎల్లిస్(Nathan Ellis) రికార్డులకెక్కాడు.
మిఛెల్ మార్ష్ కు గాయం… స్మిత్ కు పిలుపు ః
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి మెగాటోర్నీకి దూరమవగా.. తాజాగా మిఛెల్ మార్ష్ కూడా గాయపడ్డాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా మార్ష్ కు గాయమైంది. దీని నుంచి కోలుకునేందుకు కొన్ని రోజులు సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సెలక్టర్లు స్టీవ్ స్మిత్ కు పిలుపునిచ్చారు. స్మిత్ ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో అదరగొట్టాడు. పలు మెరుపు ఇన్నింగ్స్ లతో 299 పరుగులు చేశాడు. ప్రస్తుతం లంకకు బయలుదేరిన స్మిత్ గురువారం జట్టుతో కలవనున్నాడు.
