Ravindra Jadeja : 2027 వరల్డ్ కప్ కష్టమే..రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలిందా ?

Ravindra Jadeja : వన్డేలకూ రవీంద్ర జడేజా గుడ్ బై.. రిటైర్మెంట్ దిశగా అడుగులు!

Ravindra Jadeja

భారత్ క్రికెట్ లో మరో శకం ముగియబోతోంది. దశాబ్ద కాలంగా అద్భుతమైన ఆల్ రౌండర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) రిటైర్మెంట్ కు దగ్గర పడినట్టే కనిపిస్తోంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకూ కొనసాగే అవకాశం ఉందని అనుకున్నా జడేజా ప్రస్తుత ఫామ్ చూస్తే కష్టమే అని భావిస్తున్నారు.

2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బాటలోనే పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. తర్వాత వారిద్దరూ టెస్టుల నుంచి కూడా తప్పుకున్నా జడ్డూ మాత్రం టెస్ట్ , వన్డే రెండు ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. అయితే మునుపటి తరహాలో మాత్రం ప్రదర్శన లేదు. మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రదర్శనలు అస్సలు లేవు.

గత రెండేళ్లుగా గణాంకాలు చూస్తుంటే జడేజా కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే అనిపిస్తోంది.2023 వరల్డ్ కప్ (World cup) ఏడాదిలో 26 మ్యాచ్‌లాడి 31 వికెట్లు తీసిన జడేజా ఆ తర్వాత పూర్తిగా వెనుకబడిపోయాడు. 2025, 2026 సీజన్లలో 13 వన్డేలు మాత్రమే 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అటు బ్యాట్ తోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం 139 రన్స్ మాత్రమే చేశాడు.

సుదీర్ఘ వన్డేల అనుభవం ఉన్న ఆటగాడికి ఇది చాలా దారుణమైన ప్రదర్శనే. బంతితో జడేజా మునుపటి మ్యాజిక్ చూపలేక పోతున్నాడు. పైగా జట్టులో యువ ఆటగాళ్ల నుంచి పోటీ పెరిగింది. ప్రస్తుతంజడేజా స్థానానికి అక్షర్ పటేల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గత ఏడాది అక్షర్ 11 వన్డేల్లోనే 290 పరుగులు చేయడమే కాకుండా 11 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న కారణంగా అక్షర్ అందుబాటులో లేకపోయినా, జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ నాటికి అతను జట్టులోకి రావడం ఖాయం. అప్పుడు జడేజా తన స్థానాన్ని కాపాడుకోవడం కష్టమే.

Ravindra Jadeja

అలాగే బ్యాటింగ్ లోనూ ఫినిషర్ రోల్ కూడా జడ్డూ పోషించలేక పోతున్నాడు. అదే సమయంలో జడేజాను 5వ లేదా 6వ నంబర్‌లో ఆడించాలనే ప్రయోగం టీమిండియాకు ఏమాత్రం కలిసిరావడం లేదు. 5వ నంబర్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 30 పరుగులే చేశాడు. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ల రాకతో జడేజా తన 7వ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నాడు.

రానున్న  మ్యాచ్‌ల్లో ఆల్ రౌండర్ గా అసాధారణ ప్రదర్శన చేస్తే తప్ప, 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో జడేజా నిలవడం కష్టమేనని పలువురు అంచనా వేస్తున్నారు. యువ ఆటగాళ్ల పోటీ తట్టుకుని జడేజా మునుపటి మ్యాజిక్ చూపించడం అంత సులభం కాదు.

Study:చదివిన విషయాలు గుర్తుండాలంటే ఈ ట్రిక్ వాడండి..

 

Exit mobile version