WPL
మహిళల ప్రీమియర్ లీగ్ లో (WPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు మామూలుగా లేదు. టైటిల్ వేటలో దూసుకెళుతున్న ఆర్సీబీ వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. తద్వారా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. టాప్ టీమ్స్ అన్నింటిపైనా అదిరిపోయే ప్రదర్శనతో చెలరేగిపోతున్న ఆర్సీబీ తాజాగా గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్ లో ఆరంభంలో తడబడినా గౌతమి నాయక్ కీలక ఇన్నింగ్స్ బెంగళూరుకు భారీస్కోరు అందించింది.
కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో స్మృతి మంధాన, రిఛా ఘోష్ తో కలిసి గౌతమి నాయక్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. మంధానతో కలిసి 60 , రిఛా ఘోష్ తో కలిసి 69 పరుగులు జోడించిన గౌతమి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. గౌతమి నాయక్ 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 73 పరుగులు చేసింది. మంధాన 26, రిఛా ఘోష్ 27 పరుగులతో రాణించారు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కస్వి 2, గార్డనర్ 2 వికెట్లు పడగొట్టారు.
179 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ జెయింట్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న బెత్ మూనీ, సోఫీ డివైన్, కనిక అహూజా నిరాశపరిచారు. అనుష్క శర్మ 18 పరుగులకే ఔటవగా.. మిగిలిన బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.
అయితే ఆష్లే గార్డనర్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది, ఆమెకు మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ గుజరాత్ ను దెబ్బకొట్టారు. గార్డనర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 54 పరుగులు చేసింది. ఆమె పోరాటంతోనే గుజరాత్ స్కోరు 100 దాటగలిగింది. చివరి గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 పరుగులు చేసింది. దీంతో 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ ఆర్సీబీ గెలిచింది.
Harish Rao:హరీశ్ రావుకు సిట్ నోటీసులు..ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకున్నట్లేనా?
