T20: ఇక మిషన్ వరల్డ్ కప్ ఆసీస్ టూర్ తోనే షురూ

T20: ఆసీస్ టూర్ తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్జేలు, ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. అది ముగిసిన తర్వాత జనవరిలో సొంతగడ్డపై న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీల సిరీస్ లో తలపడుతుంది.

T20

భారత క్రికెట్ జట్టుకు బిజీ షెడ్యూల్ కొత్త కాదు. ఎప్పటిలానే మెగాటోర్నీలకు ముందు ఊపిరి సలపనివిధంగా వరుస సిరీస్ లు ఆడబోతోంది. టీ ట్వంటీ ప్రపంచకప్ ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీసీసీఐ పెద్ద జట్లతో సిరీస్ లు ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనతో టీమిండియా మిషన్ వరల్డ్ కప్ షురూ కానుంది. ఆస్ట్రేలియా టూర్ కోసం ప్రకటించిన టీ ట్వంటీ(T20) జట్టులో బీసీసీఐ సంచలన మార్పులేమీ చేయలేదు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఆసియాకప్ గెలిచిన జట్టు కాంబినేషన్ పై పూర్తి నమ్మకం ఉంచడమే. దాదాపుగా ఇదే జట్టు వచ్చే ప్రపంచకప్ లోనూ కొనసాగే అవకాశముంది. అయితే ఇకపై జరిగే ప్రతీ సిరీస్ లో భారత ఆటగాళ్ళకు కీలకమే.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియా సిరీస్ నుంచే టీ ట్వంటీ ప్రపంచకప్ లో చోటు ఆశిస్తున్న క్రికెటర్లకు సవాల్ మొదలుకాబోతోంది. ఆసీస్ పిచ్ లపై వీరంతా ఎలా రాణిస్తారనేది చూడాలి. వచ్చే ప్రపంచకప్ ఉపఖండంలోనే జరగబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండగా.. ఈ లోపు జరిగే సిరీస్ లలో ఒకటి విదేశీ పిచ్ లపై, మరో రెండు సిరీస్ లు స్వదేశంలో ఉండబోతున్నాయి.

T20

అయితే టీ ట్వంటీ(T20) ప్రపంచకప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న భారత జట్టు అత్యుత్తమ జట్లపైనే సిరీస్ లు గెలిస్తే తిరుగుండదు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై వన్డే సిరీస్, ఆ తర్వాత జరిగే ఐదు టీ ట్వంటీల సిరీస్ లో విజయం సాధిస్తే రానున్న ప్రపంచకప్ లో టీమిండియాకు ఎదురులేనట్టేనని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే టీ ట్వంటీల్లో ఆస్ట్రేలియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పైగా గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఆధిపత్యం కనబరచాలని పట్టుదలగా ఉంది. ఆసియాకప్ గెలవడం ద్వారా టీట్వంటీల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత్ ఇప్పుడు కంగారూలను కూడా చిత్తు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

దీని కోసమే సెలక్టర్లు సంచలన మార్పులేమీ చేయకుండా పూర్తిస్థాయి జట్టునే బరిలోకి దిగుతున్నారు. పైగా కోచ్ గంభీర్ కు, కొత్తగా వన్డే జట్టు కెప్టెన్ ఎంపికనై శుభమన్ గిల్ తో పాటు టీ ట్వంటీ సారథి సూర్యకుమార్ యాదవ్ కు కూడా ఆసీస్ టూర్ కీలకం కాబోతోంది.

ఆసీస్ టూర్ తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్జేలు, ఐదు టీ ట్వంటీలు ఆడనుంది. అది ముగిసిన తర్వాత జనవరిలో సొంతగడ్డపై న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీల సిరీస్ లో తలపడుతుంది. ఈ మూడు సిరీస్ లూ భారత్ కెప్టెన్ , కోచ్ లకు సవాల్ గానే చెప్పాలి. ఎందుకంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా పటిష్టంగానే ఉంటాయి.

పొట్టి క్రికెట్ కావడంతో ఏ జట్టునూ ఫేవరెట్ గా చెప్పలేం. నిజానికి ఆసియాకప్ లో మనకు పెద్ద పోటీ ఎదురుకాలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు అనుకున్న రీతిలో టీమిండియాను సవాల్ చేయలేకపోయాయి. కానీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో మాత్రం సిరీస్ లు అంత ఈజీగా ఉండవు. అందుకే ఆసీస్ తో సిరీస్ నుంచే వరల్డ్ కప్ టార్గెట్ గా కోచ్ గంభీర్ జట్టును రెడీ చేయబోతున్నాడు. ఆసియాకప్ ద్వారా టీమ్ కాంబినేషన్ పై కూడా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీ ట్వంటీ జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడు తమకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందే. లేకుంటే మాత్రం కోచ్ గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడడు. మొత్తం మీద భారత్ మిషన్ టీ ట్వంటీ ప్రపంచకప్ ఆస్ట్రేలియా సిరీస్ తోనే మొదలుకాబోతోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version