Team India : బౌలింగే భారత్‌కు టెన్షన్..గాడిన పడకుంటే కష్టమే

Team India : టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. గ్రూప్ 1లో సౌతాఫ్రికా మాత్రమే ఇప్పటి వరకూ సెమీస్ కు దూసుకెళ్లగా మరో బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ రేసులో నిలిచాయి.

Team India

టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. గ్రూప్ 1లో సౌతాఫ్రికా మాత్రమే ఇప్పటి వరకూ సెమీస్ కు దూసుకెళ్లగా మరో బెర్త్ కోసం భారత్(Team India), వెస్టిండీస్ రేసులో నిలిచాయి. ఆదివారం జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఆ జట్టుకు రెండో సెమీస్ బెర్త్ దక్కుతుంది. జింబాబ్వేపై భారీ విజయంతో అదరగొట్టిన టీమిండియాకు ఇప్పుడు కరేబియన్ ఛాలెంజ్ ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం బ్యాటింగ్ పరంగా కీలక ఆటగాళ్లందరూ ఫామ్ లోకి వచ్చేశారు. సంజూ శాంసన్ పర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ, సూర్యకుమార్, హార్థిక్ పాండ్యా , ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అదరగొట్టేశారు. జింబాబ్వేపై వీరంతా కలిసికట్టుగా రాణించడంతోనే భారత్ భారీస్కోరు చేయగలిగింది. జింబాబ్వేపై విజయంతో భారత్ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టు మన బౌలింగ్ లేదు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అంగీకరించాడు. జింబాబ్వేతో మ్యాచ్ తర్వాత దీనిపై సూర్యకుమార్ మాట్లాడాడు. ఈ కీలక మ్యాచ్ లో భారత్ గెలిచినా సరే బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 256 పరుగుల స్కోర్ అందించారు. అయితే, జింబాబ్వేను తక్కువ స్కోరుకే అవుట్‌ చేయడంలో బౌలర్లు విఫలమయ్యారు. ఇదే విషయాన్ని సూర్యకుమార్ నొక్కి చెప్పాడు. ప్రతి ఒక్క బ్యాటర్‌ తమ వంతుగా పరుగులు చేసారని ప్రశంసించాడు.

Team India

ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేడన్నాడు. అయితే, బంతితో ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సిందని అభిప్రాయపడ్డాడు.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయాల్సిందని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏదేమైనా గెలుపు గెలుపేనని.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తాము బౌలింగ్‌ పరంగా మరింత స్మార్ట్‌గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే అక్షర్‌ పటేల్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లోనూ భారత బౌలర్లు అనుకున్నట్టుగా రాణించలేకపోయారు. బుమ్రా పర్వాలేదనిపించగా మిగిలిన బౌలర్లు నిరాశపరిచారు. వరుణ్ చక్రవర్తి ఏకంగా 47 రన్స్ ఇచ్చేశాడు. హార్థిక్ పాండ్యా 45 పరుగులు ఇవ్వగా.. దూబే కేవలం 2 ఓవర్లలోనే 32 పరుగులు సమర్పించుకున్నాడు.

జింబాబ్వే బ్యాటర్లు సైతం మన బౌలింగ్ ను చాలా కాన్ఫిడెంట్ గా ఎదుర్కొన్నారు. అయితే ఆదివారం వెస్టిండీస్ తో మ్యాచ్ భారత(Team India) జట్టుకు చావోరేవో లాంటిది. ఒకరకంగా అది ఇరు జట్లకు క్వార్టర్ ఫైనల్ గా చెప్పొచ్చు. పైగా వెస్టిండీస్ జట్టులో ఎలాంటి హిట్టర్లున్నారో క్రికెట్ ప్రపంచానికి తెలుసు. సాతాఫ్రికాపై ఓడినా కూడా 86 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశ నుంచి మరో 80కి పైగా పరుగులు జోడించారంటే వారి బ్యాటింగ్ లోతు అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో భారత బౌలర్లు ఖచ్చితంగా స్థాయికి తగినట్టు రాణిస్తేనే విండీస్ ను కట్టడి చేసి టీమిండియా(Team India) సెమీఫైనల్లో అడుగుపెట్టగలుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version