T20 World Cup 2026: వరల్డ్ కప్ తర్వాత కొత్త కెప్టెన్.. సారథిగా స్కైను తప్పించనున్న బీసీసీఐ

T20 World Cup 2026: రెండింటిలో ఫలితం తేలలేదు. సూర్యకుమార్ విజయాల శాతం 84.9 శాతంగా ఉంది. వ్యక్తిగత ఫామ్ కోల్పోవడంతో సూర్యను కెప్టెన్ గా తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

T20 World Cup 2026

టీ ట్వంటీ ప్రపంచకప్ (T20 World Cup 2026)కోసం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ మెగా టోర్నీ తర్వాత మరికొన్ని మార్పులు చేయబోతోంది. దీనిలో భాగంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను సారథిగా తప్పించబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే సెలక్టర్లు దీనిపై చర్చించినట్టు తెలుస్తోంది. కోచ్ గంభీర్ తో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే ప్రపంచకప్ ముగిసిన తర్వాతే ఆ సమావేశం ఉండబోతున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం టెస్ట్ , వన్డే ఫార్మాట్లలో శుభమన్ గిల్ టీమిండియాను నడిపిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో సారథ్యం వహిస్తున్నాడు. పొట్టి క్రికెట్ లో అద్భుతమైన ఆటగాడిగా పేరున్నసూర్యాభాయ్ కెప్టెన్ గా అదరగొడుతున్నా ఆటగాడిగా విఫలమవుతున్నాడు.

ముఖ్యంగా అతని బ్యాటింగ్ పై కెప్టెన్సీ భారం ప్రభావం పూర్తి కనిపిస్తోంది. ఒకప్పుడు టీ 20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ గత ఏడాది కాలంగా అత్యంత పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఏడాదిగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. సారథి కావడంతో అతన్ని టీమ్ లో నుంచి తీసేయడం కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే టీ20(T20 World Cup 2026)ల్లో మిస్టర్ 360గా సూర్యకు పేరుంది.

T20 World Cup 2026

ఐపీఎల్ లో సూపర్ సక్సెస్ అవుతున్న సూర్యకుమార్ టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. ఆసీస్ టూర్ లోనూ, ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో సైతం అందరూ ఫామ్ లోకి వచ్చినా సూర్యకుమార్ మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడు. సౌతాఫ్రికాతో చివరి టీ20 ముగిసిన తర్వాత తన ఫామ్ పై తానే సెటైర్లు వేసుకున్న సూర్యకుమార్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతోంది.

మెగాటోర్నీకి ముందు అతన్ని తప్పించడం ఇష్టం లేకనే సూర్యకుమార్ ను కొనసాగిస్తున్నట్టు సమాచారం. దీంతో సారథిగా ఈ టోర్నీనే స్కైకు చివరిది కానుంది. తర్వాత ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడు. హార్థిక్ పాండ్యా తర్వాత సారథ్య బాధ్యతలు అందుకున్న సూర్యకుమార్ జట్టును బాగానే నడిపిస్తున్నాడు. కెప్టెన్ గా సూర్యకు మంచి రికార్డుంది. అతని కెప్టెన్సీలో 35 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 28 విజయాలు సాధించింది.

ఐదింటిలో ఓడిపోగా.. రెండింటిలో ఫలితం తేలలేదు. సూర్యకుమార్ విజయాల శాతం 84.9 శాతంగా ఉంది. వ్యక్తిగత ఫామ్ కోల్పోవడంతో సూర్యను కెప్టెన్ గా తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కొత్త కెప్టెన్ రేసులో అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి గిల్ ను టీ20 సారథిగా చేద్దామనుకుని భావిస్తే అతను కూడా పేలవ ఫామ్ తో ఇప్పుడు టీమ్ లో ప్లేస్ కూడా కోల్పోయాడు. మొత్తం మీద ప్రపంచకప్ ఫలితం ఎలా ఉన్నా భారత టీ20 జట్టుకు కొత్త సారథి రావడం ఖాయమైంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version