T20 World Cup
భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్(T20 World Cup) మరో ఆరు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ మెగాటోర్నీకి ముందు భారత్ చివరి సన్నాహాక సిరీస్ కూడా ఆడేసింది. అంచనాలను నిలబెట్టుకుంటూ న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. అయితే తుది జట్టు కూర్పులోనూ, ఇంకా బౌలింగ్ పరంగానూ కొన్ని ఇబ్బందులు మాత్రం కనిపిస్తున్నాయి. వీటిలో ముందు చెప్పుకోవాల్సింది ఓపెనింగ్ కాంబినేషన్ గురించే..
గిల్ ఫామ్ లో లేడని తప్పించి సంజూ శాంసన్ కు చోటు కల్పించారు. కానీ సిరీస్ ఆద్యంతం సంజూ నిరాశపరిచాడు. వరుసగా అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు అతనికి చోటే సందిగ్ధంగా మారింది. సంజూ వరుస వైఫల్యాల నేపథ్యంలో వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మకు జోడీగా ఎవరు దిగబోతున్నారనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న ఆప్షన్లలో ఇషాన్ కిషన్ సంజూ ప్లేస్ ను భర్తీ చేసే అవకాశముంది. దీనిపై మేనేజ్ మెంట్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
కానీ ఒక్కటి మాత్రం అటు ఫ్యాన్స్ కు, ఇటు మేనేజ్ మెంట్ కు ఉత్సాహాన్నిస్తోంది. అదే ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్. సరిగ్గా ఏడాది క్రితం జట్టులో చోటే లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అలాంటిది మళ్లీ దేశవాళీ క్రికెట్ రాణించి ఇప్పుడు మెగాటోర్నీకి కీలకంగా మారిపోయాడు.
ఇదిలా ఉంటే కివీస్ తో సిరీస్ ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవడం మరో సానుకూలాంశం. దాదాపు ఏడాది పాటు కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని సూర్యకుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కెప్టెన్ కాబట్టే జట్టులో ఉన్నాడంటూ కొందరు కామెంట్స్ చేశారు.
జట్టు విజయాలు సాధిస్తోంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. అయితే న్యూజిలాండ్ తో సిరీస్ ద్వారా స్కై కూడా తన మెరుపు బ్యాటింగ్ ను మళ్లీ రుచి చూపించాడు. వరల్డ్ కప్ లోనూ ఇదే జోరు కొనసాగిస్తే అంతకంటే ఏం కావాలి. మరోవైపు బౌలింగ్ పరంగా మాత్రం కొంచెం ఆందోళన కనిపిస్తోంది. పేసర్లు, స్పిన్నర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు.
కాస్తో కూస్తో హార్థిక్ పాండ్యా ఒక్కడే పర్వాలేదనిపిస్తున్నాడు. నిజానికి బ్యాటింగ్ పిచ్ లు కావడంతో బౌలర్లను పూర్తిగా తప్పుపట్టలేకున్నా ఇలాంటి పిచ్ లపై అదరగొడితేనే కదా ప్రత్యర్థి జట్లకు మన సత్తా తెలుస్తుందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాటోర్నీకి ముందు బౌలింగ్ ఒక్కడే కాస్త మెరుగుపరుచుకోవాల్సిన అంశంగా చెప్పొచ్చు.
