Bumrah:ఫైనల్ కు అడుగే దూరం..బంగ్లాపై బుమ్రాకు రెస్ట్ ?

Bumrah: యూఏఇ, పాకిస్థాన్, ఒమన్ జట్లను ఓడించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒమన్ జట్టే భారత్ కు కాస్త పోటీ ఇచ్చింది.

Bumrah

ఆసియాకప్ లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా ఫైనల్ కు మరొక్క విజయం దూరంలో నిలిచింది. సూపర్-4 ఆరంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్ దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో తలపడబోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ బంగ్లాపై గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది. బలాబలాల పరంగా చూస్తే బంగ్లాదేశ్ పై గెలవడం మన జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు.

ఎందుకంటే ఈ టోర్నీ ఆరంభం నుంచీ ప్రత్యర్థి ఎవరైనా కూడా పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. యూఏఇ, పాకిస్థాన్, ఒమన్ జట్లను ఓడించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఒమన్ జట్టే భారత్ కు కాస్త పోటీ ఇచ్చింది. మిగిలిన మ్యాచ్ లలో మాత్రం వన్ సైడ్ విక్టరీలే అందుకుంది. బ్యాటింగ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ శివతాండవం చేస్తున్నాడు. గిల్ తో కలిసి అదిరిపోయే ఆరంభాలనిస్తున్నాడు. పాక్ తో మ్యాచ్ ను 10 ఓవర్లలోనే వన్ సైడ్ గా మార్చేశాడు. ఆ మ్యాచ్ లో గిల్ కూడా ఫామ్ లోకి రావడం మరో అడ్వాంటేజ్.

Bumrah

సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ ఫామ్ కాస్త టెన్షన్ పెడుతున్నా.. మిగిలిన వారిలో హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ రాణిస్తున్నారు. శివమ్ దూబేకు బ్యాటింగ్ లో ఇంకా పూర్తిస్థాయి అవకాశం రాలేదు. అయితే సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశమిస్తారని భావిస్తున్నారు. అటు బౌలింగ్ లో పేస్ బౌలర్ బుమ్రా( Bumrah)ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. పాక్ తో మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా..భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఓవరాల్ గా ఈ టోర్నీలో 3 మ్యాచ్ లు ఆడిన బుమ్రా కేవలం 3 వికెట్లే తీశాడు. దీంతో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బుమ్రా(Bumrah)కు రెస్ట్ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. బంగ్లా చిన్న జట్టే కావడంతో బుమ్రాకు వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ కింద విశ్రాంతినిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశముంది. స్పిన్ విభాగంలో ఎటువంటి మార్పులు జరగకపోవచ్చు. పాక్ పై ఆడిన స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కొనసాగడం ఖాయం. ఓవరాల్ గా తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశముందని అంచనా.

మరోవైపు బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సూపర్ -4 తొలి మ్యాచ్ లో శ్రీలంకపై ఆ జట్టు సంచలన విజయం సాధించింది. అయితే లంకను ఓడించినంత ఈజీగా భారత్ ను నిలువరించే సత్తా బంగ్లాకు లేదని అంచనా వేస్తున్నారు. పైగా కెప్టెన్ లిట్టన్ దాస్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. మ్యాచ్ సమయానికి అతను కోలుకుంటాడని భావిస్తున్నా..దూరమైతే మాత్రం బంగ్లాకు ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ పిచ్ పై ఛేజింగ్ చేసే జట్టుకే ఎక్కువ విజయావకాశాలుంటాయి. దీంతో మరోసారి టాస్ కీలకం కాబోతోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version