Rohit
భారత క్రికెట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ(Rohit) శకం ముగిసింది. వన్డే జట్టు సారథిగా బీసీసీఐ అతన్ని తప్పించి శుభమన్ గిల్ కు పగ్గాలు అప్పగించింది. అయితే రోహిత్ పై వేటు పడడం ప్రస్తుతం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ముఖ్యంగా అతని ఫ్యాన్స్ బీసీసీఐని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. కెప్టెన్ గా అద్భుతమైన రికార్డున్న రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లోనే కొనసాగుతున్నాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి క్రికెట్ కు, ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు.
దీంతో వచ్చే వరల్డ్ కప్ వరకూ వన్డేల్లో అతను ఖచ్చితంగా జట్టును నడిపిస్తాడని చాలా మంది అనుకున్నారు. అదే సమయంలో గిల్ ను మూడు ఫార్మాట్ల కెప్టెన్ గా చేసేందుకు గంభీర్ ప్లాన్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ లో సారథిగా పగ్గాలు అందుకున్న గిల్… టీ ట్వంటీల్లో వైస్ కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. అయితే రోహిత్ విషయంలో గంభీర్ ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్టు, సెలక్టర్లు కూడా అతనికే మద్ధతుగా నిలిచినట్టు సమాచారం.
ముఖ్యంగా రోహిత్ వయసు, ఫామ్ రోహిత్(Rohit) ను కెప్టెన్ గా తప్పించడానికి కారణమైంది. వచ్చే వన్డే ప్రపంచకప్ 2027లో జరుగుతుంది. అప్పటికి హిట్ మ్యాన్ వయసు 40కి చేరుతుంది. అప్పటి వరకూ అతను తన ఫిట్ నెస్ కాపాడుకుంటాడా అనేదే పెద్ద ప్రశ్న… అలాగే ఫామ్ పరంగానూ చాలా అనుమానాలున్నాయి. ఒకవేళ ఫిట్ గా లేకుంటే… మెగాటోర్నీకి కొన్ని రోజుల ముందు తప్పుకుంటే మాత్రం జట్టుపై గట్టి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అప్పటికప్పుడు సారథిగా మరో ఆటగాడిని నియమించినా వెంటనే సెటిలయ్యే పరిస్థితి ఉండగు. అలాగే రోహిత్ పేలవ ఫామ్ మరో కారణం. గత కొంతకాలంగా రోహిత్ ఫామ్ స్థాయికి తగినట్టు లేదు. పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నాడు. ఇది కూడా గంభీర్ మరో కారణంగా చూపించినట్టు తెలుస్తోంది.
వీటితో పాటు మూడు ఫార్మాట్లకు ఒక కెప్టెనే ఉండాలన్నది బీసీసీఐ అభిప్రాయం. గతంలో పరిస్థితుల కారణంగా కొంతకాలం వేర్వేరు కెప్టెన్లు ఉన్నప్పటకీ ఓవరాల్ గా ఒకరే సారథిగా ఉండాలన్నది కోచ్ గంభీర్ నిర్ణయం కూడా. దీంతో గిల్ ను అన్ని ఫార్మాట్లలోనూ సారథిగా ఎంపిక చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నాడు. పైగా గంభీర్ కు ఇష్టమైన ప్లేయర్ గా గిల్ పేరు వినిపిస్తుంటుంది.
అందుకే జట్టులో కొందరు సీనియర్లు ఉన్నా రోహిత్(Rohit) తర్వాత టెస్టుల్లో గిల్ కే కెప్టెన్సీ అప్పగించడానికి ఇదే కారణమని వార్తలు వినిపించాయి. మొత్తం మీద పలు చారిత్రక విజయాల్లో కీలకంగా ఉన్న రోహిత్ ను ఇలా సారథ్య బాధ్యతల నుంచి తప్పింటడం అతని ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. ఇప్పటి వరకూ రోహిత్ తన కెప్టెన్సీ తొలగింపుపై స్పందించలేదు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఆసీస్ తో వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఫిట్ నెస్ విషయంలో అప్రమత్తమై 10 కిలోలు కూడా తగ్గాడు. అయినప్పటకీ బీసీసీఐ మాత్రం కెప్టెన్సీ మార్పు విషయంలో ముందుకే వెళ్ళడం వెనుక గంభీరే కారణమని రోహిత్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.