Nitish Kumar Reddy
భారత్, సౌతాఫ్రికా మధ్య కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. అంతా అనుకున్నట్టుగానే తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండబోతున్నారు. రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనుండగా, జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడనున్నాడు.
కోచ్ ర్యాన్ డస్కాటే దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. పంత్, జురెల్ ఇద్దరూ తొలి టెస్ట్ ఆడతారని చెప్పాడు. గత వారం రోజులుగా భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధాన వికెట్ కీపర్ గా పంత్ ను, బ్యాకప్ గా జురెల్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే జురెల్ సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో దుమ్ములేపాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలు బాదాడు.
తొలి ఇన్నింగ్స్ లో 132, రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ నాటౌట్ గా నిలిచి జట్టుకు మంచి స్కోర్లు అందించాడు. ఇటీవల విండీస్ పైనా జురెల్ సెంచరీ చేశాడు. పంత్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆ సిరీస్ లో ప్రధాన వికెట్ కీపర్ గా బాధ్యతలు అందుకున్నాడు. తాజాగా అతని వరుస సెంచరీలతో కోచ్ గంభీర్, కెప్టెన్ కు తుది జట్టు ఎంపిక మరింత తలనొప్పిగా మారింది.
జురెల్ ను పక్కన పెట్టలేని పరిస్థితి.. అదే సమయంలో తుది జట్టులో ఎవరిని తప్పించి అతన్ని తీసుకోవాలనే దానిపై తర్జన భర్జన పడ్డారు. చివరికి పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) స్థానంలో జురెల్ ఆడబోతున్నాడు. సాయి సుదర్శన్ ను పక్కన పెడతారని భావించినా నితీశ్ రెడ్డి(Nitish Kumar Reddy)నే తప్పించారు. సాధారణంగా తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండడం చాలా అరుదు. వన్డేల్లో ధోనీ, దినేశ్ కార్తీక్, పార్టీట్ పటేల్ కలిసి ఆడినప్పటికీ… టెస్ట్ తుది జట్టులో ఉన్న సందర్భాలు లేవు.
గతంలో 1986లో కిరణ్ మోరె, చంద్రకాంత్ పండిట్ కలిసి ఒకటి రెండు టెస్టులు ఆడాడు. అప్పుడు పండిట్ కు స్పెషలిస్ట్ బ్యాటర్గా అవకాశం దక్కింది. ఇప్పుడు మళ్లీ 39 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో ఇద్దరు వికెట్ కీపర్లు(పంత్, జురల్)తో భారత్ బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంటే తొలి టెస్టు తుది జట్టులో నితీశకు చోటు లేకపోవడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆల్ రౌండర్ ను భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ జట్టు సిరీస్ కోసం ఎంపిక చేసింది. దీంతో నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy)తిలక్ వర్మ కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగే అనధికారిక పరిమిత ఓవర్ల సిరీస్ లో ఆడనున్నాడు.
