U19 World Cup : మన కుర్రాళ్ళకు మరో విజయం..అండర్ 19 ప్రపంచకప్

U19 World Cup : భారత్ అండర్ 19 జట్టు రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై18 పరుగుల తేడాతో విజయం సాధించింది

జింబాబ్వే , నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ (U19 World Cup) లో భారత యువ జట్టు అదరగొడుతోంది. తొలి మ్యాచ్ లో అమెరికాను చిత్తుగా ఓడించిన భారత్ అండర్ 19 జట్టు రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచింది. ఉత్కంఠ పోరులో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే మరోసారి నిరాశపరిచాడు. అలాగే వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా కూడా త్వరగానే ఔటయ్యారు.

ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్ కుందు హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా వైభవ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. అటు కుందు కూడా నిలకడగా ఆడుతూ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 62 పరుగులు జోడించారు. వైభవ్ ఔటైన తర్వాత కుందు, కనిష్క చౌహాన్ కూడా కీలకమైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

దీంతో భారత్ అండర్ 19 జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో బంగ్లాదేశ్ కూడా త్వరగానే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ తమీమ్, ఓపెనర్ రిఫాత్ బెగ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. అయితే మధ్యలో వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి ప్రారంభమైన తర్వాత టార్గెట్ ను 29 ఓవర్లలో 165 పరుగులుగా నిర్ణయించారు.

U19 World Cup

ఇక్కడ నుంచీ భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు. చివర్లో భారీ షాట్లకు ప్రయత్నించే క్రమంలో బంగ్లా బ్యాటర్లు వెంటవెంటనే ఔటయ్యారు. ముఖ్యంగా విహాన్ మల్హోత్రా సూపర్ స్పెల్ తో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

దీంతో బంగ్లాదేశ్ 146 పరుగులకే కుప్పకూలింది. ఖిలాన్ పటేల్ 2, దేవేంద్రన్ 1, హెనిల్ పటేల్ 1, కనిష్క చౌహాన్ 1 వికెట్ తీశారు. ఈ టోర్నీలో భారత్ అండర్ 19 జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. కాగా ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా బంగ్లా కెప్టెన్ కు భారత సారథి ఆయుశ్ మాత్రే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Megastar:బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ర్యాంపేజ్..బుక్‌మైషోలో చిరు సరికొత్త చరిత్ర గురించి తెలుసా?

Exit mobile version