Delhi Capitals : ఐపీఎల్ 2026 సీజన్…డేంజరస్ గా ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals : ఐపీఎల్ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్... ప్రతీ సీజన్ ముందు జట్ల కూర్పుపై రకరకాల అంచనాలు ఉంటాయి. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఢిల్లీ క్యాపిటల్స్ 2026 సీజన్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది

Delhi Capitals

ఐపీఎల్ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్… ప్రతీ సీజన్ ముందు జట్ల కూర్పుపై రకరకాల అంచనాలు ఉంటాయి. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) 2026 సీజన్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. రిషబ్ పంత్ స్థానంలో కొత్త కెప్టెన్, స్టార్ ఓపెనర్లు, పవర్‌ఫుల్ ఫినిషర్లతో ఈ జట్టు చూడటానికి చాలా బలంగా కనిపిస్తోంది.

గత కొన్నేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తోనే ఉంటూ నిలకడగా రాణిస్తున్న అక్షర్, జట్టును ఈ సారి ముందుండి టైటిల్ దిశగా నడిపించగలడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఢిల్లీ గూటికి చేరడం. అతను వికెట్ కీపర్‌గా మరియు ఓపెనర్‌గా జట్టుకు భారీ బలాన్ని ఇస్తాడనడంలో సందేహం లేదు.

రాహుల్ అనుభవం అక్షర్ పటేల్‌కు వ్యూహాల పరంగా కూడా తోడ్పడుతుంది. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను గమనిస్తే, విధ్వంసకర ఆటగాళ్లతో నిండిపోయింది. ఇంగ్లండ్ డైనమిక్ బ్యాటర్ బెన్ డకెట్ రాకతో టాప్ ఆర్డర్ మరింత దూకుడుగా మారిందని చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్‌లో అనుభవజ్ఞుడైన నితిశ్ రాణా ఉండటం వల్ల స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ ఇద్దరూ ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. చివరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించే వీరిద్దరూ ఫినిషర్లుగా ఉండటం ఢిల్లీ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.గత సీజన్‌లో మెరుపులు మెరిపించిన యువ సంచలనం అశుతోష్‌ శర్మకు కూడా ఈ లిస్టులో చోటు దక్కింది. మరోవైపు ఢిల్లీ బౌలింగ్ అటాక్ అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో ఉంది.

Delhi Capitals

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎడమచేతి వాటం పేసర్ స్టార్క్ రాకతో పవర్ ప్లేలో వికెట్లు గ్యారెంటీ. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ‘యార్కర్ కింగ్’ నటరాజన్ ఉండటం వల్ల చివరి ఓవర్లలో పరుగులను కట్టడి చేయవచ్చు.

స్పిన్ మ్యాజిక్ చేయడానికి కుల్దీప్ సిద్ధంగా ఉన్నాడు. అక్షర్, కుల్దీప్ జోడీ ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టడం ఖాయం. జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ ఔకిబ్ నబీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఇతను తన వేగంతో ఆకట్టుకోగలడు. సమతూకమైన బ్యాటింగ్, పదునైన బౌలింగ్, మరియు లోకల్ టాలెంట్‌తో ఈ జట్టు పక్కా ప్రణాళికతో కనిపిస్తోంది. మరి 2026 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) గ్రౌండ్ లో కూడా ఈ అంచనాలు అందుకుంటేందేమో చూడాలి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version