WPL : ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా ?..ఆర్సీబీతో డబ్ల్యూపీఎల్ టైటిల్ పోరు

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ తుది అంకానికి చేరింది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి

WPL

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL ) 2026 సీజన్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. వరుసగా నాలుగోసారి ఫైనల్ కు దూసుకొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగైనా ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. 2024 సీజన్ లో తమను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయిన ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.

మరోవైపు ఈ సీజన్ ఆరంభం నుంచీ అదరగొడుతున్న ఆర్సీబీ మరోసారి టైటిల్ పై కన్నేసింది. నిజానికి ఆర్సీబీతో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన కాస్త తడబాటుగానే సాగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్ ను వరుసగా రెండు ఓటములతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత పుంజుకుంది. కొత్త కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తోంది. ముంబై, ఆర్సీబీ, యూపీ , గుజరాత్ జట్లపై కీలక సమయాల్లో సాధించిన విజయాలు ఢిల్లీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి.

ప్రతీ సీజన్ లో అదరగొడుతూ ఫైనల్ కు చేరుతున్నా తుది మెట్టుపై బోల్తా పడుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ఫైనల్ ఫోబియాను అధిగమించాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు బ్యాటింగ్ లో లారా వోల్వార్ట్ , లిజెల్లీ లీ, జెమీమా రోడ్రిగ్స్ , షెఫాలీ వర్మ కీలకంగా ఉన్నారు.

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL ) 2026 సీజన్ ఢిల్లీ ఫైనల్ చేరడంలో వీరిదే కీలకపాత్ర. ఫైనల్లోనూ ఈ బ్యాటర్లు అదరగొడితే ఢిల్లీకి తిరుగుండదు. ముఖ్యంగా సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ లిజెల్లీ లీ సూపర్ ఫామ్ లో ఉంది. ఢిల్లీ తరపున రెండు హాఫ్ సెంచరీలతో 283 పరుగులు చేసి టాప్ స్కోర్ గా నిలిచింది.

WPL

అలాగే బౌలింగ్ లో నందిని శర్మ, చినెల్లీ హెన్రీ, శ్రీచరణిపై అంచనాలున్నాయి. విండీస్ కు చెందిన చినెల్లీ హెన్రీ 12 వికెట్లతో సత్తా చాటింది. అలాగే తొలి సీజన్ లోనే నందిని శర్మ 16 వికెట్లతో అదరగొట్టింది. ఈ ఇద్దరినీ ఎదుర్కోవడం ఆర్సీబీ బ్యాటర్లకు సవాలే.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం సీజన్ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తోంది. ఆ జట్టు 8 మ్యాచ్ లలో రెండింటిలోనే పరాజయం పాలవగా ఆరింటిలో గెలిచింది. స్మృతి మంధాన ఆర్సీబీకి ఎంత కీలకమైన ప్లేయరో అందరికీ తెలుసు. సారథిగానే కాకుండా వ్యక్తిగతంగానూ రాణిస్తోంది. సీజన్ మొత్తం మీద 290 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్న స్మృతి టైటిల్ పోరులో చెలరేగాలని ఎదురుచూస్తోంది. ఆమెతో పాటు ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ కూడా దూకుడుగా ఆడుతోంది.

ఇక బౌలింగ్ లో లారెన్ బెల్ సైతం ఆర్సీబీకి కీలకంగా మారింది. 12 వికెట్లతో ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ ప్లే చేసింది. డిక్లార్క్ , శ్రేయాంకా పాటిల్ కూడా రాణిస్తే ఢిల్లీ బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. ఇదిలా ఉంటే గత రికార్డుల్లో మాత్రం ఆర్సీబీపై ఢిల్లీదే పైచేయిగా ఉంది. ఈ సీజన్ లో రెండుసార్లు తలపడితే చెరొక మ్యాచ్ గెలిచాయి. మొత్తం మీద రెండోసారి టైటిల్ పై ఆర్సీబీ కన్నేస్తే.. తొలిసారి ట్రోఫీని అందుకునేందుకు ఢిల్లీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Under 19 World Cup : శతక్కొట్టిన ఆరోన్ జార్జ్..అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్

Exit mobile version