Deepfakes
కృత్రిమ మేధస్సు (AI) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో, సాంకేతికత అందిస్తున్న ఒక అతి పెద్ద సవాలు ‘డీప్‌ఫేక్స్’ (Deepfakes). డీప్‌ఫేక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌లను ఉపయోగించి సృష్టించబడిన నకిలీ వీడియో లేదా ఆడియో. ఇందులో ఒక వ్యక్తి ముఖాన్ని లేదా వాయిస్‌ను మరొక వ్యక్తికి చెందిన దృశ్యాలకు చాలా రియలస్టిక్‌గా (Highly Realistic) అతికించవచ్చు.
దీని ద్వారా ఆ వ్యక్తి నిజంగానే ఆ మాట మాట్లాడినట్లు లేదా ఆ పని చేసినట్లు అనిపిస్తుంది. ఈ సాంకేతికత ఇప్పుడు ట్రూత్ క్రైసిస్ (Truth Crisis) లేదా విశ్వసనీయత సంక్షోభాన్ని సృష్టిస్తోంది, ఎందుకంటే మనం కళ్లతో చూసినా, చెవులతో విన్నా కూడా దాన్ని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.
డీప్‌ఫేక్స్ (Deepfakes)ఇప్పుడు కేవలం వినోదానికి (Entertainment) లేదా హాస్యాస్పద కంటెంట్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. వీటిని ఉపయోగించి రాజకీయ నాయకులు లేదా ప్రముఖ వ్యక్తులు మాట్లాడని మాటలను లేదా చేయని పనులను చేసినట్లుగా ప్రదర్శించడం ద్వారా వారి పరువును తీయడం, అపఖ్యాతి పాలు చేయడం (Defamation) జరుగుతోంది.
ఎన్నికల సమయంలో (Elections) లేదా ఆర్థిక మార్కెట్లలో (Financial Markets) తప్పుడు సమాచారాన్ని (Misinformation) వ్యాప్తి చేయడానికి డీప్‌ఫేక్స్ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతున్నాయి. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో జ్యుడీషియల్ సిస్టమ్‌లో (Judicial System) కూడా పెద్ద సమస్యలను సృష్టించొచ్చన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే వీడియో లేదా ఆడియో సాక్ష్యాలను (Evidence) నమ్మడం కష్టమవుతుంది. డీప్‌ఫేక్‌లను తయారు చేయడం ఎంత ఈజీనో, వాటిని నిజమైన కంటెంట్ నుంచి వేరు చేసి గుర్తించడం (Detection) అంతే కష్టం.
ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి, సాంకేతిక రంగంలో నిపుణులు ఇప్పుడు డీప్‌ఫేక్‌లను గుర్తించే అధునాతన అల్గారిథమ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ డిటెక్షన్ టూల్స్ వీడియోలలోని చిన్న చిన్న అసాధారణ అంశాలను (Anomalies) – ఉదాహరణకు కళ్లు రెప్పవేయని విధానం, లైటింగ్ లో తేడాలు, లేదా అసాధారణమైన చలనాలను – గుర్తించడానికి ప్రయత్నిస్తాయి.
అయితే, డీప్‌ఫేక్ (Deepfakes)టెక్నాలజీ కూడా నిరంతరం మెరుగుపడుతూ టెక్నాలజీకి సవాల్ విసరడంతో..ఈ పోరాటం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. సామాన్య పౌరులుగా మనం చేయగలిగిందల్లా, సోషల్ మీడియాలో చూసిన లేదా విన్న ప్రతి విషయాన్ని విమర్శనాత్మక దృక్పథంతో (Critical Thinking) చూడటం, దాని సోర్స్ (Source),దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రశ్నించాలి. డీప్‌ఫేక్ యుగంలో, అక్షరాస్యత (Media Literacy) ఎంత ముఖ్యమో, నిజాయితీ (Integrity) విశ్వసనీయత కూడా అంతే ముఖ్యం అని అంతా గుర్తించాలి.
