ATM
మీ ఏటీఎం (ATM)నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? అయితే, ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. తాజాగా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ విపరీతంగా షేర్ అవుతోంది. ఏటీఎంలలో ట్రాన్సాక్షన్ పూర్తి కాగానే, క్యాన్సిల్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే, మీ కార్డ్ వివరాలు మెషీన్‌లో మిగిలిపోకుండా, సైబర్ దొంగల నుంచి మీ డబ్బు రక్షించబడుతుందన్న వార్త వైరల్ అవుతోంది. అయితే.. ఇది పూర్తిగా అవాస్తవం. ఏటీఎంలలో మీ లావాదేవీల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఈ వాదనలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గానీ, ఏ ఇతర ప్రభుత్వ సంస్థ గానీ ఎటువంటి సూచనలు ఇవ్వలేదు.
ఏటీఎంలలో ఉండే క్యాన్సిల్ (Cancel) బటన్ కేవలం మీరు చేస్తున్న లావాదేవీని రద్దు చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. ఉదాహరణకు, మీరు తప్పు మొత్తం ఎంటర్ చేసినప్పుడు లేదా వేరొక ఏటీఎంకు వెళ్లాలని అనుకున్నప్పుడు ఈ బటన్‌ను ఉపయోగించి లావాదేవీని రద్దు చేయవచ్చు. ఇది ఏటీఎం మెషీన్‌లోని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మోసాలను నిరోధించలేదు.
ఏటీఎం(ATM) మోసాలను నివారించడానికి మీరు అపోహలను నమ్మాల్సిన అవసరం లేదు. ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.మీ పిన్ నంబర్‌ను ఎప్పుడూ గోప్యంగా ఉంచండి. పిన్ ఎంటర్ చేస్తున్నప్పుడు మీ చేతితో కీప్యాడ్‌ను కప్పి ఉంచండి.
పిన్ నంబర్ మార్చుతూ ఉండాలి. ప్రతి 3 నుంచి 6 నెలలకు మీ ఏటీఎం పిన్‌ను తప్పకుండా మార్చుకోండి.బలమైన పిన్‌ను వాడండి. మీ పుట్టినరోజు, ఫోన్ నంబర్ చివరి నాలుగు అంకెలు, లేదా 1234, 1111 వంటి సులభమైన నంబర్లకు బదులుగా, యాదృచ్ఛికంగా ఉండే సంఖ్యలను ఎంచుకోండి.
IMDb list : టాప్‌లో ప్రభాస్ ..దూసుకువచ్చిన పవన్ .. IMDb జాబితాలో టాలీవుడ్ హవా
ఏటీఎం(ATM)లో డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు అపరిచితుల సహాయాన్ని తీసుకోకండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, బ్యాంకు సిబ్బందిని లేదా హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి.
అనుమానాస్పద పరికరాలను గమనించండి. ఏటీఎం కార్డు పెట్టే స్లాట్ (Card Slot), కీప్యాడ్ పైన లేదా చుట్టూ ఏదైనా అనుమానాస్పద పరికరాలు (స్కిమ్మర్స్) ఉన్నాయేమో ఒకసారి గమనించండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీ డబ్బుకు మీరే రక్షకులు.