మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ తన వినియోగదారులకు (Users) ఒక అదిరిపోయే కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. అదే, యూజర్ నేమ్ (Username) వ్యవస్థ. ఈ తాజా అప్‌డేట్‌తో యూజర్లు ఇకపై తమ మొబైల్ నంబర్‌లను పంచుకోకుండానే ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ మాదిరిగా ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్‌తో చాట్ చేయొచ్చు.
ఈ కొత్త ఫీచర్ చాలా కాలంగా డెవలప్‌మెంట్‌లో ఉంది. ప్రస్తుతం, వాట్సాప్ తాజా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.25.28.12) లో ఈ ఫీచర్‌ను పరిమిత వినియోగదారుల సమూహంతో టెస్టింగ్ చేస్తోంది.
WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ యూజర్లు వారి ప్రొఫైల్ సెట్టింగ్‌ల నుంచి నేరుగా తమకు నచ్చిన యూజర్ నేమ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం:
వ్యక్తిగత గోప్యత (Privacy).. యూజర్లు ఇకపై కొత్త వారితో చాట్ చేయడానికి లేదా ఆన్‌లైన్ పరస్పర చర్యల కోసం తమ ఫోన్ నంబర్‌లను వెల్లడించాల్సిన అవసరం ఉండదు.
సురక్షిత సంభాషణ.. ముఖ్యంగా వ్యాపారాలు లేదా తమ వ్యక్తిగత సంప్రదింపు వివరాలను పంచుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల కోసం వాట్సాప్‌ను మరింత ప్రైవేట్‌గా మరియు సరళంగా మార్చడానికి ఈ యూజర్‌నేమ్ వ్యవస్థను రూపొందించారు.
యూజర్ నేమ్ క్రియేట్ చేసుకునే నియమాలు..ఈ కొత్త యూజర్ నేమ్ వ్యవస్థలో కొన్ని నియమాలను కూడా వాట్సాప్(WhatsApp) నిర్దేశించింది. వెబ్ లింక్‌లతో గందరగోళం ఏర్పడకుండా నివారించడానికి, యూజర్ నేమ్‌ను క్రియేట్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన రూల్స్:
యూజర్ నేమ్ “www.” తో ప్రారంభించకూడదు. కనీసం ఒక అక్షరం అయినా తప్పనిసరిగా ఉండాలి. అక్షరమాలతో పాటు సంఖ్యలు, మరియు అండర్ స్కోర్‌లను (_) కూడా చేర్చొచ్చు. ఈ నియమాలు యూజర్ నేమ్‌ను ప్రత్యేకంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చేస్తాయి. వినియోగదారు పేరు సెట్ చేసిన తర్వాత, ఇతరులు మీ ఫోన్ నంబర్ అవసరం లేకుండానే, మీ యూజర్ నేమ్ ద్వారా సులభంగా మీతో చాట్ చేయవచ్చు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని పరిమిత బీటా వినియోగదారుల సమూహంతో టెస్టింగ్‌లో ఉంది. ఇది ఇంకా గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ కింద ఉన్న అందరికీ అందుబాటులోకి రాలేదు. వాట్సాప్(WhatsApp) ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌ను త్వరలో మరిన్ని బీటా పరీక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఆ టెస్టింగ్ పూర్తయిన తర్వాత, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ విడుదల కానుంది.