ఈ డిజిటల్ ప్రపంచంలో ‘వాట్సాప్(WhatsApp)’ లేని ఫోన్ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయితే మన వ్యక్తిగత సంభాషణలు, ఫోటోలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్న. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త కొత్త పద్ధతుల్లో వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేస్తూ మన పర్సనల్ డేటాను దొంగిలిస్తున్నారు.
మీరు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మీ అకౌంట్ వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. మీ వాట్సాప్(WhatsApp) ను ఒక ఇనుప కోటలా మార్చుకోవాలనుకుంటే, వెంటనే ఒక మూడు ముఖ్యమైన సెట్టింగ్స్ మార్చుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఇవి చాలామందికి తెలిసినవే అయినా, కొంతమంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు.
మొదటిది.. టూ-స్టెప్ వెరిఫికేషన్ (Two-Step Verification). ఇది మీ అకౌంట్‌కు అత్యంత ముఖ్యమైన భద్రత. వాట్సాప్ సెట్టింగ్స్ లో అకౌంట్ విభాగంలోకి వెళ్లి దీన్ని ఎనేబుల్ చేసి, ఆరు అంకెల పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఎవరైనా మీ సిమ్ కార్డు దొంగిలించినా లేదా మీ ఓటీపీ తెలుసుకున్నా, ఈ పిన్ లేకుండా మీ వాట్సాప్ ను ఓపెన్ చేయలేరు.
రెండోది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ (End-to-end Encrypted Backup).. సాధారణంగా మన చాట్స్ అన్నీ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ లోనో బ్యాకప్ అవుతుంటాయి. కానీ అక్కడ అవి సేఫ్ కాదు..ఈ సెట్టింగ్ ఆన్ చేయడం వల్ల మీ బ్యాకప్ కూడా లాక్ చేయబడుతుంది. అంటే మీ అనుమతి లేదా పాస్‌వర్డ్ లేకుండా గూగుల్ కూడా మీ మెసేజ్ లను చదవలేదు.
మూడోది సెక్యూరిటీ నోటిఫికేషన్స్ , లింక్డ్ డివైజెస్.. మీ వాట్సాప్‌ను మీ అనుమతి లేకుండా ఎవరైనా వేరే కంప్యూటర్ లో గాని, ఫోన్ లో గాని లాగిన్ చేశారో లేదో ‘లింక్డ్ డివైజెస్’ (Linked Devices) లో తరచూ చెక్ చేస్తుండాలి. ఒకవేళ ఏదైనా తెలియని డివైజ్ కనిపిస్తే వెంటనే ‘లాగ్ అవుట్’ చేయాలి.
అలాగే షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ ఆన్ చేయడం ద్వారా, మీ కాంటాక్ట్స్ లో ఎవరైనా కోడ్ మార్చినప్పుడు మీకు హెచ్చరిక వస్తుంది. ఈ మూడు సెట్టింగ్స్ పాటిస్తే ఇక మీ వాట్సాప్ ను హ్యాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
