Canned Beer
బీర్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ బీర్ బ్రాండ్లు కింగ్‌ఫిషర్, హైనెకెన్‌ను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని,రూ. 90 కోట్లతో ఒక కొత్త క్యాన్డ్ బీర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.
ఈ కొత్త ప్లాంట్ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, కొత్లాపూర్ గ్రామంలో ఉన్న నిజాం బ్రూవరీలో ఏర్పాటు కాబోతోంది. ప్రస్తుతం ఇక్కడ 0.5 మిలియన్ హెక్టోలీటర్ల సామర్థ్యం ఉంది. కొత్త ప్లాంట్‌తో మరో 0.4 మిలియన్ హెక్టోలీటర్ల సామర్థ్యం పెరిగి, మొత్తం సామర్థ్యం 0.9 మిలియన్ హెక్టోలీటర్లకు చేరుకుంటుంది. ఈ ప్లాంట్ ఏడాదిలోగా అందుబాటులోకి వస్తుందని UBL ప్రకటించింది.
క్యాన్డ్ బీర్‌కు ఎందుకంత ప్రాధాన్యత అంటే..తెలంగాణ దేశంలోనే అతిపెద్ద బీర్ మార్కెట్లలో ఒకటి అని అందరికీ తెలిసిందే. ఇక్కడ క్యాన్డ్ బీర్లకు యూత్‌లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. బాటిళ్లతో పోలిస్తే క్యాన్స్ ఎక్కువ సౌకర్యవంతంగా, ఈజీగా తీసుకెళ్లడానికి వీలుగా ఉంటాయి.
అందుకే వినియోగదారులు క్యాన్డ్ బీర్(canned beer )కు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం UBL సంస్థ మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి క్యాన్డ్ బీర్‌ను దిగుమతి చేసుకుని తెలంగాణలో అమ్ముతోంది. అయితే, ఇకపై ఇక్కడే ఉత్పత్తి చేయనుండటంతో వినియోగదారులకు మరింత సులభంగా అందుబాటులోకి రానుంది.
ఈ పెట్టుబడి తమ సంస్థలో వచ్చిన లాభాల నుంచే చేస్తున్నామని, దీనికి కావాల్సిన అన్ని అనుమతులు ఇప్పటికే లభించాయని UBL తెలిపింది. తెలంగాణ మార్కెట్ తమకు చాలా ముఖ్యమని, ఈ విస్తరణతో మార్కెట్‌లో తమ వాటా మరింత పెరుగుతుందని UBL MD & CEO వివేక్ గుప్తా తెలిపారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, UBL మాతృ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన హైనెకెన్ NV సంస్థ కూడా తమ మొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(GCC)ను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇది తెలంగాణకు దక్కుతున్న మరో అరుదైన గౌరవంగా చెప్పొచ్చు.