Medaram
మేడారం ( Medaram )మహాజాతరకు ముందే సమ్మక్క-సారలమ్మ గద్దెలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జనవరి 28 నుంచి 31 వరకు అంటే నాలుగు రోజుల పాటు మేడారం( Medaram ) మహా జాతర జరగనుంది. ఆ సమయంలో ఉండే విపరీతమైన రద్దీని తప్పించుకోవడానికి చాలామంది భక్తులు ఇప్పుడే మేడారం బాట పట్టారు. దీనికి తోడు సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జనసంద్రంగా మారింది.
ఆదివారం ఒక్కరోజే సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతర కోసం కోటిన్నర మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా తప్పిపోతే వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని మంత్రి సూచించారు.
జనవరి 28, బుధవారం (సారలమ్మ గద్దెకు రాక).. జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. ఇదే రోజు కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును కూడా గద్దెలకు తీసుకువస్తారు. దీంతో సమ్మక్క సారలమ్మ జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.
జనవరి 29, గురువారం (సమ్మక్క గద్దెకు రాక).. ఇది జాతరలో అత్యంత కీలకమైన రోజుగా చెబుతారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు. తల్లి గద్దెపైకి వచ్చే సమయంలో భక్తులు మొక్కులు చెల్లిస్తూ.. ‘జై సమ్మక్క.. జై సారక్క’ అంటూ చేసే నినాదాలతో మేడారం మారుమోగిపోతుంది.
జనవరి 30, శుక్రవారం (భక్తుల మొక్కులు).. ఈ రోజు అమ్మవార్లు ఇద్దరూ కూడా గద్దెలపైనే కొలువై ఉండటం ప్రత్యేక ఆకర్షణ. రెండు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు.. ఈ రోజే తమ నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రభుత్వం తరపున ప్రముఖులు చాలామంది అమ్మవారిని ఈ రోజే దర్శించుకుంటారు.
జనవరి 31, శనివారం (వనప్రవేశం).. జాతర ముగింపు రోజున అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. సాయంత్రం వేళ దేవతలు తిరిగి అడవిలోకి వెళ్లడంతో నాలుగు రోజుల మహాజాతర ఘనంగా ముగుస్తుంది.
Sankranthi:సంక్రాంతి తేదీల గందరగోళం.. మరి పండితులు ఏం చెబుతున్నారు?
