Farmer insurance: రైతు బీమాకు అప్లై చేయడానికి మరో అవకాశం..!

Farmer insurance: రైతు బీమా పథకానికి అర్హత పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.దరఖాస్తు చేసుకునే రైతు వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి.

Farmer insurance

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాల్లో రైతు బీమా(Farmer insurance) ఒకటి. ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన గడువును ప్రకటించింది. ఆగస్ట్ 13వ తేదీ వరకు ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందినవారు, గతంలో ఈ పథకంలో చేరనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

రైతు భరోసా, రైతు బీమా (Farmer insurance)వంటి పథకాల ద్వారా రైతుల ఆర్థిక భద్రతను పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా కదులుతోంది . ముఖ్యంగా, రైతు బీమా పథకం ద్వారా, ఒక రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే, వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతు మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది.సహజ మరణం అయినా, ప్రమాదవశాత్తు మరణం అయినా ఈ పథకం వర్తిస్తుంది. ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.

రైతు ఈ పథకానికి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం స్వయంగా LICకి చెల్లిస్తుంది. ఏటా ప్రీమియం మొత్తం పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆ భారాన్ని రైతులపై మోపకుండా తానే భరిస్తోంది.

Farmer insurance

ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలి?
రైతు బీమా పథకానికి అర్హత పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.దరఖాస్తు చేసుకునే రైతు వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.అవి పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ (లేదా MRO డిజిటల్ సంతకంతో కూడిన DS పేపర్), రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలి.

అర్హత ఉన్న రైతులు ఆగస్ట్ 13వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. కొత్తగా అప్లికేషన్ చేసుకున్న రైతుల పేర్లను అధికారులు రైతు బీమా పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఈ పథకం 2025-26 బీమా సంవత్సరం ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానుంది.

ఈ పథకం ఆగస్ట్ 14, 2018న ప్రారంభమై, ఇప్పటికీ లక్షలాది రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తెలంగాణలో దాదాపు 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఈ పథకంలో ఉన్నారు.

 

Exit mobile version