Cables and electrical wires
హైదరాబాద్ మహానగరంలో గాలిలో వేలాడుతున్న విద్యుత్, కేబుల్ వైర్లు (Cables and electrical wires)ప్రాణాలను తీస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేవలం రెండు రోజుల్లోనే మూడు వేర్వేరు ఘటనల్లో కరెంట్ షాక్‌కు గురై ఏకంగా 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ వరుస విషాదాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి.
వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై స్పందించిన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ..ప్రజల భద్రతకు తీవ్రమైన సవాలుగా మారిన ఈ అనధికారిక, వేలాడుతున్న విద్యుత్ ,కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసులు, విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేసి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
డిప్యూటీ సీఎం ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారుల్లో చలనం వచ్చింది. భారీ వర్షాలు పడుతున్నందున ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు ప్రజలు వెళ్లవద్దని సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరెంటు స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్ల(Cables and electrical wires)ను తొలగించే పనిని వేగవంతం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉప్పల్, రామంతపూర్, చిలకానగర్ వంటి ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం.. అనధికారిక వైర్ల విపరీతమైన విస్తరణ. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలికాం సంస్థలు అనుమతులు లేకుండానే తమ వైర్లను విద్యుత్ స్తంభాలపై వేయడం వల్ల విద్యుత్ వైర్లు, ఇతర కేబుల్ వైర్లు ఒకదానిలో ఒకటి చిక్కుకొని ప్రమాదకరంగా మారుతున్నాయి.
కృష్ణాష్టమి రోజున రామంతాపూర్‌లోని గోకుల్‌నగర్‌లో జరిగిన శ్రీకృష్ణుని రథోత్సవంలో విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం తెలంగాణ వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించడంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
అలాగే మంగళవారం చాంద్రాయణగుట్ట, బండ్లగూడలో వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా 22 అడుగుల విగ్రహం కరెంటు వైర్లను తాకింది. వాటిని కర్రతో పక్కకు జరుపుతున్న క్రమంలో కరెంట్ షాక్‌కు గురై ధోని (21), వికాస్ (20) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అంతేకాదు అంబర్‌పేటలో వినాయక మండపానికి పందిరి వేస్తుండగా రామ్ చరణ్ అనే వ్యక్తి కరెంటు తీగలను కర్రతో పైకి లేపుతూ షాక్‌కు గురయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా ఈ ఆరు నెలల్లో హైదరాబాద్‌లో ఇలాంటి ప్రమాదాల వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎల్.బి.నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, బేగంపేట్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.
Also Read: Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం..ఏపీ , తెలంగాణకు అలర్ట్