Betting Apps: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ నజర్: 29 మంది సెలబ్రెటీలపై కేసు నమోదు

Betting Apps:ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల చీకటి సామ్రాజ్యం ఇప్పుడు బట్టబయలు అవుతోంది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక అడుగులు వేసింది.

Betting Apps:ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల చీకటి సామ్రాజ్యం ఇప్పుడు బట్టబయలు అవుతోంది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED)కీలక అడుగులు వేసింది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన వివిధ కేసుల ఆధారంగా, ఈడీ( ED) అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖ సినీ తారలు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు సహా మొత్తం 29 మందిపై కేసు నమోదైంది. వీరిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల వంటి పేర్లు ఉన్నాయి. బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. త్వరలో ఈడీప్రముఖుల వాంగ్మూలాలను నమోదు చేసి, కేసును మరింత ముందుకు తీసుకెళ్లనుంది.

తెలంగాణ పోలీసుల తొలి అడుగులు, ఈడీ ప్రవేశం

బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే విస్తృత దర్యాప్తు చేపట్టారు. యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసి, పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. ఈ కేసు తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన మొదటి సమాచార నివేదిక (FIR) ఆధారంగానే ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగడంకేసులో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది.

మనీ లాండరింగ్ ఆరోపణలు, ప్రచార వ్యూహాలు

యువతను ఆకర్షించేందుకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సినిమా నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ప్రముఖులతో భారీ ఎత్తున ప్రమోషన్లు(Celebrity Promotion)చేయిస్తున్నారు. ఇందుకోసం వీరికి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఈ ప్రమోషన్ల ద్వారా పొందిన మొత్తాలను చాలామంది తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ల (IT Returns) లో చూపించడం లేదన్న ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఇది మనీ లాండరింగ్ కు దారితీసిందని ఈడీ భావిస్తోంది. అంతేకాకుండా, ఈ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రమోషనల్ వీడియోలను షేర్ చేయడం ద్వారా, వారికి ఉన్న లక్షలాది మంది ఫాలోవర్ల కారణంగా బెట్టింగ్ యాప్‌లు అనూహ్యంగా వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి.

సామాజిక విఘాతం, ప్రభుత్వ చర్యలు

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది బెట్టింగ్‌కు బానిసలవుతున్నారు. ఒకసారి అదృష్టం కలిసొస్తే కోట్లు సంపాదించవచ్చని భ్రమపడి, ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజుకూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలై తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. చివరకు, లక్షల్లో పేరుకుపోయిన అప్పులు తీర్చలేక, కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్‌ల దారుణమైన ప్రభావంపై మీడియాలో వచ్చిన నివేదికలు, ప్రజా ఆందోళనల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్‌లతో పాటు వాటిని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ వ్యవహారంలో ఇప్పుడు ఈడీ ప్రవేశించడంతో, అక్రమ బెట్టింగ్ ప్రమోటర్లకు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version