Urea: ఎన్నాళ్లీ యూరియా వెతలు

Urea: వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు వేగంగా ఎదుగుతున్నాయి. ఈ దశలో పంటకు యూరియా అవసరం చాలా ఎక్కువ. సరిగ్గా ఈ సమయంలోనే యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Urea

తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి రైతన్నకు మంచి రోజులు వస్తాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. పాలకుల మారినా, విధానాలు మారినా, తమ కష్టాలు మాత్రం మారడం లేదని ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, వానలు బాగా పడుతున్న ఈ సమయంలో యూరియా కొరత రైతులను కొత్త టెన్షన్ పెడుతోంది. ఇది కేవలం ఒక సమస్య కాదు, దేశానికి వెన్నుముక లాంటి రైతన్నను చిన్నచూపు చూస్తున్నారా అని ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు వేగంగా ఎదుగుతున్నాయి. ఈ దశలో పంటకు యూరియా అవసరం చాలా ఎక్కువ. సరిగ్గా ఈ సమయంలోనే యూరియా(Urea) దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు తమ కాళ్లకు చెప్పులు క్యూలో పెట్టి, అరిగిపోయిన కాళ్లతో పక్కన కూర్చుంటున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ఇలాంటి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

సిద్దిపేట జిల్లా (Medak district) దుబ్బాకలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద పరిస్థితి మరీ దారుణం. యూరియా స్టాక్ వచ్చిందని తెలియగానే వేల మంది రైతులు క్యూ కట్టారు. కానీ వచ్చిన స్టాక్ సరిపోక, వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. గణాంకాలు చూస్తే, సిద్దిపేట జిల్లాకు అవసరమైన 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాలో కేవలం 16 వేలు మాత్రమే వచ్చింది. సంగారెడ్డి జిల్లాకు 38,772 టన్నులకు 24 వేలు, మెదక్ జిల్లాకు 26 వేల టన్నులకు కేవలం 12 వేలు మాత్రమే సరఫరా అయింది. అంటే, డిమాండ్‌కు తగ్గ సరఫరా పూర్తిగా కొరవడింది.

Urea

రైతుల కష్టాన్ని వ్యాపారంగా మార్చుకున్న కొంతమంది వ్యాపారులు, కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు యూరియా(urea)ను అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలంటే తీసుకో, లేదంటే వెళ్లు అంటూ రైతులను దురుసుగా మాట్లాడుతున్నారు. ఈ విషయాలు అధికారుల దృష్టికి వెళ్ళినా, కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తేనే ఈ దందా అరికట్టబడుతుందని వారు కోరుతున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేలోపు, పంటలకు యూరియా వేయాల్సిన సమయం మించిపోతోంది. అదును దాటితే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకముందే, పాలకులు, అధికారులు మేల్కొని వెంటనే సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

యూరియా నిల్వలు లేవని ప్రభుత్వాలు ముందుగా ఎందుకు అంచనా వేయలేకపోయాయి? సరఫరా వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది? రైతులు తమ పొలం పనులు, సమయం వదిలి రోజుల తరబడి క్యూలలో ఎందుకు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది? అధికార యంత్రాంగం నిద్రపోతోందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Exit mobile version