Hyderabad
సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభమవడంతో హైదరాబాద్ (Hyderabad) నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం దీనికి వీకెండ్ కూడా తోడవడంతో శుక్రవారం సాయంత్రం నుంచే నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వెహికల్స్ రద్దీ క్రమంగా పెరుగుతోంది.
చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. రోడ్డు విస్తరణ పనులు, అండర్ పాస్ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న చోట్ల.. వాహనాలు చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు.
మరోవైపు ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు విజయవాడ హైవేకు బదులుగా నాగార్జునసాగర్ రహదారిని ఎంచుకోవడం మంచిదని పోలీసులు అంటున్నారు. ఔటర్ రింగురోడ్డు మీదుగా వెళ్లేవారు బెంగళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని సాగర్ హైవేపైకి వెళ్తే జర్నీ సాఫీగా సాగుతుంది.
అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకుంటే మంచిది. నార్కట్‌పల్లి దాటితే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. భువనగిరి వైపు వెళ్లే వారు ఘట్‌కేసర్ ఎగ్జిట్ ద్వారా వరంగల్ హైవేలోకి ప్రవేశించొచ్చు. ముఖ్యంగా ఆదివారం చౌటుప్పల్‌లో సంత జరుగుతుంది కాబట్టి, ఆ రోజు వెహికల్స్ రాకపోకలకు మరింత అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లోని మెయిన్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్ జంక్షన్లు ప్రయాణికులతో సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ సుమారు 6,432 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి బస్సులు కేటాయించగా, మిగిలినవి తెలంగాణలోని వివిధ జిల్లాలకు సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఈ ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఇదే అదునుగా ప్రైవేట్ వాహనాలు,ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరలను అమాంతం పెంచేయడంతో సామాన్య ప్రయాణికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Chiranjeevi:చిరు సినిమాకు తెలంగాణ సర్కార్ నుంచీ గ్రీన్ సిగ్నల్..మరి కోర్టు చిక్కుల మాటేంటి?
