Election:జూబ్లీహిల్స్ పోరు..జోరందుకున్న తెరవెనుక ఒప్పందాలు

Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకోకపోవడం, ఆ పార్టీ సానుభూతిపరుల్లో గందరగోళానికి దారితీస్తోంది.

Election

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల(Election) షెడ్యూల్ వెలువడినప్పటి నుంచీ, ఈ నియోజకవర్గంలో రాజకీయం బహిరంగ ప్రచారం కంటే నిశ్శబ్ద సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇక్కడ విజేతను తేల్చేది నేరుగా పార్టీల బలప్రదర్శన కాదనీ, ఓట్ల బదిలీలు , తెరవెనుక ఒప్పందాలే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, మజ్లిస్ (AIMIM) సహకారం అత్యంత కీలకంగా మారింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మజ్లిస్‌ను తమ మిత్రపక్షంగా ప్రకటించుకున్నా కూడా, ఆ సహకారం ఏ మేరకు మనస్ఫూర్తిగా ఉంటుందన్నదానిపైనే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

చరిత్రను పరిశీలిస్తే, మజ్లిస్ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఓవైసీ బహిరంగంగా మద్దతు ప్రకటించరు.. అంతా తమ కమ్యూనిటీలోకి అంతర్గతంగా పంపే సందేశం ద్వారానే రాజకీయం నడుస్తుంది. మజ్లిస్‌కు జూబ్లీహిల్స్‌లో మంచి ఓటు బలం ఉంది. 2014లో ఇక్కడ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన మజ్లిస్, ఇప్పుడు పోటీకి దూరంగా ఉంది.

Election

పాతబస్తీలోని తమ రాజకీయ జోలికి రాకుండా ఉండేందుకు, ఇతర నియోజకవర్గాల్లో ఇలాంటి లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఒకవేళ మజ్లిస్ సంపూర్ణంగా కాంగ్రెస్ కు సహకరిస్తే, అది ఆ పార్టీ విజయానికి బలమైన పునాది అవుతుంది.

మరో ప్రధాన అంశం బీజేపీ వైఖరి. ఈ ఉపఎన్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకోకపోవడం, ఆ పార్టీ సానుభూతిపరుల్లో గందరగోళానికి దారితీస్తోంది. బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన ట్వీట్ ఆరోపణలు ఈ రాజకీయ సమీకరణాలకు మరింత మసాలా జోడించాయి.
టీడీపీ ఇక్కడ చురుగ్గా లేకపోయినా కూడా, ఆ పార్టీ మద్దతుదారులతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు మాగంటి గోపీనాథ్ సతీమణి అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉండేలా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. మొత్తంగా, ఈ నియోజకవర్గంలో పాత స్నేహాలు, కొత్త ఒప్పందాలు, సామాజిక వర్గాల సమీకరణాలే తుది ఫలితాన్ని తేల్చబోతున్నాయి తప్ప, కేవలం అభ్యర్థుల బలం మాత్రమే కాదన్నది సుస్పష్టం.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version