KCR
తెలంగాణ రాజకీయాలు అంటేనే వాడీవేడీ విమర్శలు,నువ్వా నేనా అన్నట్లు సాగే పోరాటాలు. కానీ సోమవారం తెలంగాణ శాసనసభ సాక్షిగా ఒక అద్భుతమైన, అత్యంత హుందాతనమైన దృశ్యం ఆవిష్కృతమైంది. చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా, ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగే నాయకులుగా ముద్రపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ముఖాముఖి తారసపడ్డారు.
కేవలం కలవడమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ ఉన్న చోటుకు వెళ్లి చిరునవ్వుతో కరచాలనం (Shake Hand) ఇచ్చారు. రాజకీయాల్లో ఎన్ని విబేధాలు ఉన్నా, వ్యక్తిగత గౌరవం, సంస్కారం ముఖ్యం అని ఈ ఘటన చాటిచెప్పింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి ఆత్మీయంగా అడిగి తెలుసుకోవడం సభలో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సభకు రావడం చాలా అరుదుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన బాత్‌రూంలో జారిపడి గాయపడటం, ఆ తర్వాత సర్జరీ జరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
బడ్జెట్ సమావేశాల సమయంలో కొద్దిసేపు వచ్చి వెళ్లిన కేసీఆర్, మళ్లీ ఇప్పుడు సభలో అడుగుపెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సభలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క వంటి ప్రముఖులు కూడా ఆయన దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఇది చూస్తుంటే రాజకీయాల్లో విమర్శలు కేవలం సిద్ధాంత పరమైనవే తప్ప వ్యక్తిగతమైనవి కావనే సందేశం ప్రజల్లోకి వెళ్లింది.
అయితే, కేసీఆర్ సభలో ఎక్కువ సేపు ఉండలేదు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసిన కొద్దిసేపటికే ఆయన నందినగర్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు సభలో పార్టీ ఫిరాయింపుల అంశం సెగలు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వంటి ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీల వైపు కూర్చోవడంపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వీరు ఇంకా సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని స్పీకర్ ప్రకటించినా, వారు అధికార పక్షం వైపు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన గళాన్ని వినిపించారు. భీంగల్ ఆసుపత్రి పనుల కోసం కేవలం 5 కోట్ల నిధులు ఇవ్వలేక పనులను ఆపేయడం సరికాదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కాగా శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే, ఇటీవలే కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మణ్ రెడ్డిల మృతి పట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సంతాప తీర్మానాలపై చర్చ ముగిసిన తర్వాత, స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి (శుక్రవారం) వాయిదా వేశారు.
అటు శాసనమండలిలో కూడా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానాల తర్వాత సభను జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ఏడాదికి అసెంబ్లీ సమావేశాలు ముగిసినట్లయ్యింది. మళ్లీ కొత్త ఏడాదిలో అంటే జనవరి 2న ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులు, ప్రాజెక్టులపై చర్చలు ప్రారంభం కానున్నాయి.
ముందు ముందు ఈ సమావేశాలు మరింత హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాల వినియోగం , సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ చర్చ జరగనుంది. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ గతంలో చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది.అటు జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం, వార్డుల సంఖ్యను 300కి పెంచడం వంటి కీలక బిల్లులు ఈ విడతలో చర్చకు రానున్నాయి.
మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఈ ‘కరచాలనం’ మాత్రం ఈ ఏడాది ముగింపులో ఒక పాజిటివ్ రాజకీయ సంప్రదాయానికి నాంది పలికింది. అయితే కేసీఆర్ మళ్లీ జనవరి 2న జరిగే సమావేశాలకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఆయన సభలో ఉంటే చర్చల స్థాయి మరో రేంజ్‌లో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అప్పుడు బడ్జెట్ సమావేశాల సమయంలో, ఇప్పుడు కూడా గులాబీ బాస్ ఇలాగే ఉంటే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆయన ప్రశ్నిస్తే ఇంకెలా ఉంటుందో చూద్దామని ఆశపడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్గం మరోసారి భంగపడతారా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
