OU
తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో అగ్రగామిగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. విద్యార్థుల ప్రయోజనాల కంటే, ఉన్నతాధికారుల సౌకర్యాలకే యూనివర్సిటీ ప్రాధాన్యత ఇస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, కొత్త కోర్సులకు నిధులు లేవని చెబుతూనే, ఖరీదైన లగ్జరీ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ప్రస్తుత టెక్నాలజీ అవసరాలకు తగ్గట్టుగా కొన్ని కొత్త ఇంజినీరింగ్, హానర్స్ కోర్సులను ప్రారంభించాలని సూచించింది. ఆధునిక విద్యా విధానాలను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు లభిస్తాయని మండలి అభిప్రాయపడింది.
అయితే, ఈ ప్రతిపాదనలను ఉస్మానియా యూనివర్సిటీ తిరస్కరించింది. ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు లేవని, సిబ్బంది కొరత ఉందని కారణాలు చూపింది. వర్సిటీలో ఇప్పటికే ఉన్న కోర్సులకే తగినంత మంది అధ్యాపకులు లేరని, ఈ పరిస్థితుల్లో కొత్త కోర్సులను నిర్వహించడం సాధ్యం కాదని ఉన్నత విద్యా మండలికి సమాధానం పంపింది.
కానీ ఇక్కడే ఓయూ(OU)తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన కోర్సుల విషయంలో నిధుల కొరతను కారణంగా చూపిస్తున్న యూనివర్సిటీ, మరోవైపు కొత్త కార్ల కొనుగోలుకు మాత్రం తెగ ఉత్సాహం చూపిస్తుందట. వీసీ, ఇతర ఉన్నతాధికారుల కోసం దాదాపు రూ. కోటి 20 లక్షల విలువైన కొత్త లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలని యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టకుండా, కీలకమైన కోర్సుల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్న యూనివర్సిటీ, ఉన్నతాధికారుల వ్యక్తిగత సౌకర్యాలకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడానికి సిద్ధపడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరతను నిజమైన సమస్యగా చూపించి, నిధులు ఉన్నా కూడా వాటిని ఇలా అనవసరమైన ఖర్చులకు మళ్లించడం యూనివర్సిటీ పారదర్శకతపై అనుమానాలను పెంచుతోంది.
ఈ పరిణామాలు ఉస్మానియా యూనివర్సిటీ (OU)తన ప్రాధాన్యతలను మరచిపోయి, విద్యార్థుల ప్రయోజనాలకు కాకుండా, అధికార సౌకర్యాలకు ప్రాముఖ్యత ఇస్తుందనే విమర్శలకు దారితీస్తున్నాయి. ఇలాంటి చర్యలు యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇచ్చి, నిధులను సరైన మార్గంలో వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.