Musi
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది(Musi) ప్రక్షాళన , పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను ఎప్పుడు మొదలుపెడతారనే దానిపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ పనులకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు భావిస్తోంది. తెలుగు వారి కొత్త సంవత్సరాది రోజైన ఉగాది నాడు ఈ బృహత్తర కార్యానికి శంకుస్థాపన చేయడం ద్వారా ఒక మంచి ఆరంభాన్ని ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ(Musi) ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణ అనేది ఒక పెద్ద సవాలుగా ఉన్నా కూడా, తాజాగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. దాదాపు 4,100 కోట్ల రూపాయల మేర రుణం మంజూరు చేసేందుకు ఏడీబీ అంగీకరించినట్లు అధికార వర్గాల సమాచారం.
ఈ నిధులతో మొదటి దశ పనులను వేగవంతం చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొరియా , జపాన్ దేశాలకు అధికారుల బృందాన్ని పంపి, అక్కడ నదులను ఎలా అభివృద్ధి చేశారు, పర్యాటక రంగంగా ఎలా తీర్చిదిద్దారు అనే అంశాలపై అధ్యయనం చేయించింది. ఆ నమూనాలను మన మూసీ నదికి కూడా వర్తింపజేయాలని చూస్తున్నారు.
మొదటి దశలో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మొత్తం 55 కిలోమీటర్ల మూసీ నది తీరంలో కేవలం 9 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చబోతున్నారు. అక్కడ మహాత్మా గాంధీకి సంబంధించిన అతి పెద్ద విగ్రహం, ఒక మ్యూజియం, సర్వమత ప్రార్థనా మందిరాలు నిర్మించనున్నారు.
దీని కోసం రక్షణ శాఖ నుంచి సుమారు 250 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి నిధుల ప్రక్రియ పూర్తయితే, ఉగాది నాటికి టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతారు.
