IPL 2026 Auction
ఐపీఎల్ మినీ వేలం(IPL 2026 Auction)లో అంచనాలకు తగ్గట్టే పలువురు ప్లేయర్స్ అమ్ముడయ్యారు. గత ఫ్రాంచైజీలు వదిలేసిన ప్లేయర్స్ వచ్చే సీజన్ నుంచి కొత్త జట్లకు ఆడబోతున్నారు. ఈ సారి వేలంలో ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్ లో అందరినీ ఆకర్షించిన రవి బిష్ణోయ్ వచ్చే సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు.
2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలం(IPL 2026 Auction)లోకి వచ్చిన ఈ లెగ్ స్పిన్నర్ కోసం ఫ్రాంచైజీలు బాగానే పోటీపడ్డాయి. అతని బేస్ ప్రైస్ లోనే కొనేందుకు రాజస్థాన్ మొదట బిడ్ వేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ రేటు పెంచింది. అలా పెంచుకుంటూ వెళ్లగా చెన్నై 4.2 కోట్ల దగ్గర ఆగింది. అటు రాజస్థాన్ కూడా బిడ్డింగ్ ధర పెంచుతూ పోయింది. రాజస్థాన్ రాయల్స్ 6 కోట్లకు బిడ్ వేసినప్పుడు చెన్నై వెనక్కి తగ్గడంతో దాదాపుగా రాయల్స్ కే రవి బిష్ణోయ్ వెళ్లిపోయేలా కనిపించాడు.
చివరి నిమిషంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. జట్టులో మంచి స్వదేశీ లెగ్ స్పిన్నర్ కోసం చూస్తున్న కావ్యా పాప 6.2 కోట్ల నుంచి బిడ్డింగ్ మొదలుపెట్టింది. అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో 7 కోట్ల వరకూ వెళ్లిన కావ్యా మారన్ ఆ తర్వాత చేతులెత్తేసింది. ఫలితంగా రాజస్థాన్ 7.20 కోట్లకు బిష్ణోయ్ ను దక్కించుకుంది.
కాగా పంజాబ్ కింగ్స్ తో రవి బిష్ణోయ్ కెరీర్ మొదలైంది. లెగ్ బ్రేక్ బౌలర్ గా తక్కువ కాలంలోనే అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గూగ్లీలు సంధించడంలో స్పెషలిస్ట్ గా పేరుంది. బిష్ణోయ్ గూగ్లీలను ఆడేందుకు పలువురు బ్యాటర్లు ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి.
వికెట్లు సమర్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ కు ఆడినప్పుడు అనిల్ కుంబ్లే శిక్షణలో రాటు దేలాడు. తొలి సీజన్ లోనే 12 వికెట్లతో ఎమర్జింగ్ ప్లేయర్ రేసులో నిలిచాడు. రెండో సీజన్ లోనూ రాణించాడు. 2022 నుంచి లక్నో సూపర్ జెయింట్స్ తరపున కీలక బౌలర్ గా పలు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. ఫలితంగా 2025 సీజన్ కు లక్నో సూపర్ జెయింట్స్ రిటైన్ చేసుకుంది. మినీ వేలానికి ముందు అతన్ని విడిచిపెట్టింది. తక్కువ ధరకు దక్కించుకుందామనుకున్న లక్నో వ్యూహం ఫలించలేదు. ఓవరాల్ గా రవి బిష్ణోయ్ ఐపీఎల్ కెరీర్ ను చూస్తే 77 మ్యాచ్ లలో 72 వికెట్లు పడగొట్టాడు.
