Supreme Court : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన BRS పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court)కీలక తీర్పునివ్వడం హాట్ టాపిక్ అయింది. ఈ కేసు విచారణ హైకోర్టు నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై 3 నెలల లోగా స్పీకర్(Speaker) నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
Supreme Court
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, BRS 39 స్థానాలతో ప్రతిపక్షంలో ఉంది. అయితే, కొద్ది నెలల వ్యవధిలోనే BRSకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని BRS తీవ్రంగా పరిగణించి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయపోరాటానికి దిగింది.
2024 ఏప్రిల్ న BRS ఎమ్మెల్యేలు ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు.
2024 సెప్టెంబర్ న హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని, లేదంటే తామే సుమోటోగా కేసును విచారిస్తామని హెచ్చరించింది.
స్పీకర్‌కు కాలపరిమితి విధించడం సరికాదని పేర్కొంటూ, హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. పదో షెడ్యూల్ ప్రకారం తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ జనవరి 2025లో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఫిబ్రవరిలో ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, “సహేతుకమైన సమయం” అంటే ఎంత అనేది కచ్చితంగా చెప్పాలని తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ దృష్టికి వెళ్లి పది నెలలు అవుతున్నా ఎందుకు ఆలస్యం అవుతోందని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో 10 మంది ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్‌కు కూడా నోటీసులు జారీ చేసి, వారి వాదనలను వింది. ఏప్రిల్ 3న వాదనలు పూర్తి చేసి, తీర్పును రిజర్వ్ చేసింది.
జూలై 31న వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు 3 నెలలతో కూడిన కాలపరిమితి విధించింది. ఈ తీర్పు నేపథ్యంలో, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ సుప్రీం సూచించిన గడువులోపు నిర్ణయం తీసుకోకపోతే, కోర్టు ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు BRSకు ఒక విజయం కాగా, ఫిరాయింపుదారుల భవిష్యత్తు ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉంది.