Telangana
తెలంగాణ(Telangana)లో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు దాదాపుగా లైన్ క్లియర్ అయింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఇక పల్లె పోరుకు రంగం సిద్ధమవుతోంది. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా… కోర్టు పరిధిలో ఉండడం, ఇతరత్రా కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా వెలువడే అవకాశముంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులో కేసు విచారణ నడుస్తున్న నేపథ్యంలో ముందు షెడ్యూల్, తర్వాత నోటిఫికేషన్ జారీ చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం ఈసీ వర్గాల సమాచారం ప్రకారం ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు , ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఒకవేళ షెడ్యూల్ విడుదలైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణలో ప్రస్తుతం 12,777 గ్రామ పంచాయతీలుండగా… 5,982 ఎంపీటీసీ, 585 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామపంచాయతీలోని సర్పంచ్ లు పదవీ కాలం గత ఏడాది జనవరి 31తోనే ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులే పాలన కొనసాగిస్తున్నారు.. 2024 జూన్ నెలలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉండగా.. . సార్వత్రిక ఎన్నికలు కారణంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం కారణంగా మరింత ఆలస్యమైంది.
ఇదిలా ఉంటే అయితే సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటకీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందన్నది చూడాలి. హైకోర్టు నిర్దేశించిన సమయంలోపే నోటిఫికేషన్ విడుదల చేసినా కోర్టును కొంత గడువు కోరి ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల కోసం ఈసీ పక్కా ప్లానింగ్ ప్రకారం ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది శిక్షణ, ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వరుసగా రివ్యూ మీటింగ్స్ తో బిజీగా ఉంది. మరోవైపు బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా దీనిపై కోర్టును కూడా ఆశ్రయించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి బీసీలకు రిజర్వేషన్లు పెంచారని చెబుతున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదన్న నిబంధనను పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం తరపున ఏజీ వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు.