Iran
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈరోజు అంటే ఫిబ్రవరి 28, 2026 మధ్యాహ్నం నుంచి ఇరాన్(Iran), ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై క్షిపణుల వర్షాన్ని కురిపించాయి.
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలతో ఇజ్రాయెల్ సింహగర్జన పేరుతో భీకర దాడులకు దిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసం, కార్యాలయాలే టార్గెట్‌గా ఈ దాడులు జరగడంతో.. ఖమేనీని వెంటనే సురక్షితమైన బంకర్‌లోకి తరలించారు.
ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్..భారీ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఇరాన్(Iran) కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా సుమారు 70 ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడుల వల్ల ఇజ్రాయెల్ రాజధాని అయిన టెల్ అవీవ్‌లో భారీ నష్టమే వాటిల్లింది. ఒకే బస్సు డిపోలో ఏకంగా 28 బస్సులు కాలి బూడిదయిపోయాయి. యుద్ధ పరిణామాలతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించి.. విద్యాసంస్థలు, కార్యాలయాలను మూసివేసింది.
మరోవైపు ఈ యుద్ధ ప్రభావం సామాన్యులపైన కూడా గట్టిగానే పడుతోంది. ఇటు గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా మరోసారి చుక్కలు చూపిస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ఒక్క రోజే దాదాపు 7 వేల రూపాయలు పెరగగా, వెండి ధర కిలోపై ఏకంగా ఎవరూ ఏ మాత్రం ఊహించని విధంగా.. 25 వేల రూపాయలు పెరిగింది.
ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల పుత్తడి లక్షా 68 వేల రూపాయలను దాటేయగా, వెండి ధర 3 లక్షల 20 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. కేవలం బంగారం, వెండి ధరలే కాదు, విమాన ప్రయాణాలపై కూడా ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం పడింది.
పశ్చిమాసియా వైపు వెళ్లాల్సిన విమానాలను ఎయిర్‌లైన్స్ క్యాన్సిల్ చేసేశాయి. మరోవైపు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇరాన్‌లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.
ఇటు మభారత ప్రభుత్వం యద్ధ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న ఇండియన్స్ కోసం ఇండియన్ ఎంబసీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. భారతీయులు ఎక్కడున్నా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, స్థానిక ప్రభుత్వాల నిబంధనలను పాటించాలని వారికి సూచించింది.
మరోవైపు ఇరాన్‌లో ఒక స్కూల్‌పై జరిగిన దాడిలో ఏకంగా 36 మంది విద్యార్థినులు మరణించడం అందరినీ కలిచివేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ సైన్యం లొంగిపోయే వరకు దాడులు ఆపబోమని హెచ్చరించారు. అయితే దీనికి యుద్ధం మీరే మొదలుపెట్టారు కాబట్టి.. ముగింపు మేము పలుకుతామంటూ ఇరాన్ ఘాటుగా స్పందించింది. కాగా బ్రిటన్, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా ఈ యుద్ధం పట్ల ఆందోళనను వ్యక్తం చేస్తూ, వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుతున్నాయి.
