Telangana
తెలంగాణ(Telangana)లో రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ తెలంగాణ ఈసీ విడుదల చేసింది. మొత్తం 31 జిల్లాల్లోకి 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్టు తెలిపింది. ఈ సారి మెుత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసేలా ఈసీ ప్రణాళిక రూపొందించింది. మెుదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లోనూ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు దశలో పూర్తి చేయబోతున్నారు.
దీనిలో భాగంగా అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 12 వేల 733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ వెల్లడించింది. తొలి విడతలో అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండో విడతలో అక్టోబర్ 27న నిర్వహిస్తారు. మరోవైపు గ్రామ పంచాయతీలకు సంబంధించి అక్టోబర్ 31న ఫస్ట్ ఫేజ్ ,నవంబర్ 4న సెకండ్ ఫేజ్ , నవంబర్ 8న థర్డ్ ఫేజ్ నిర్వహించున్నారు. అలాగే ఫలితాల వెల్లడికి సంబంధించి కూడా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు ప్రకటించనుండగా…. సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు పోలింగ్ జరిగిన రోజే వెల్లడించనున్నట్టు ఈసీ తెలిపింది. దీంతో నవంబర్ 11తో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. కాగా స్ఖానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య చూస్తే ఒక కోటీ 67 లక్షల 3 వేల 168 మంది ఉండగా.. దీనిలో 81,65,894 పురుష ఓటర్లు, 85,36,770 మహిళా ఓటర్లు, 504 మంది ఇతరులు ఉన్నారు.
ముఖ్యమైన తేదీలు ః
ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు తొలిదశ ః
అక్టోబర్ 9 – నోటిఫికేషన్ జారీ
అక్టోబర్ 23 – పోలింగ్
నవంబర్ 11 – కౌంటింగ్
ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు రెండోదశ ః
అక్టోబర్ 13 – నోటిఫికేషన్ జారీ
అక్టోబర్ 27 – పోలింగ్
నవంబర్ 11 – కౌంటింగ్
గ్రామపంచాయతీలు, వార్డులు మూడో దశ ః
అక్టోబర్ 17 – నోటిఫికేషన్
అక్టోబర్ 31 – పోలింగ్
అక్టోబర్ 31 – కౌంటింగ్
గ్రామపంచాయతీలు, వార్డులు నాలుగో దశ ః
అక్టోబర్ 21 – నోటిఫికేషన్
నవంబర్ 4 – పోలింగ్
నవంబర్ 4 – కౌంటింగ్
గ్రామపంచాయతీలు, వార్డులు ఐదో దశ ః
అక్టోబర్ 25 – నోటిఫికేషన్
నవంబర్ 8 – పోలింగ్
నవంబర్ 8 – కౌంటింగ్