Telangana Municipal Elections
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు(Telangana Municipal Elections) క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2,996 వార్డుల్లో ప్రచార పర్వం ముగియడంతో అధికారులు పోలింగ్‌కు కూడా సర్వం సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచే మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూతపడ్డాయి.
ఈ నెల 11 వతేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 26 లక్షలుగా ఉండటంతో.. ఇది అభ్యర్థుల గెలుపోటములను శాసించే ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
రాజకీయ విశ్లేషణ ప్రకారం ఒకసారి చూస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత అదే ఊపులో ఉన్న కాంగ్రెస్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన కార్పొరేషన్లలో కూడా ఈసారి తన జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉంది.
రేవంత్ రెడ్డి నాయకత్వం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పార్టీకి పట్టణ ప్రాంతాల్లో 45 నుంచి 50 శాతం వరకు వార్డులను తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇది అగ్నిపరీక్ష లాగే కనిపిస్తోంది. పదేళ్ల పాలన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీ, తన పట్టున్న కరీంనగర్, సూర్యాపేట వంటి చోట్ల పట్టు నిలుపుకోవడానికి బాగా శ్రమిస్తోంది. సుమారు 30 నుంచి 35 శాతం వార్డులను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.
ఈసారి బీజేపీ, జనసేన పార్టీలు సర్‌ప్రైజ్ ప్యాకేజీలా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. పట్టణ మధ్యతరగతి ఓటర్లు , యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా గతంలో కంటే ఎక్కువ వార్డులను గెలుచుకోవాలని ఆ రెండు పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈసారి పోటీలో స్వతంత్ర అభ్యర్థులు ,ఇతర చిన్న పార్టీలు కూడా కొన్ని కీలక స్థానాల్లో ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరుగుతుండటంతో, ఫలితాల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భద్రతా పరంగా చూస్తే ఇటు ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడా రాజీ పడటం లేదు. దాదాపు 25 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచబోతున్నారు. వీటిలో 1,900 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా, 1,400 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించి, సీసీటీవీల ద్వారా ప్రతి కదలికను కూడా మానిటర్ చేస్తున్నారు. మద్యం షాపులు కేవలం పోలింగ్ ముగిసే వరకు మాత్రమే కాకుండా, రిజల్ట్ వెల్లడయ్యే 13వ తేదీన కూడా మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మున్సిపల్ ఎన్నికల (Telangana Municipal Elections)ఫలితాలు తెలంగాణ భవిష్యత్తు రాజకీయ దిశను నిర్దేశించబోతున్నాయి.
