Temperatures
తెలంగాణలో చలి పులి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు(Temperatures) సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాష్ట్రం మొత్తం గడ్డకట్టే చలిలో చిక్కుకుపోయింది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) సింగిల్ డిజిట్‌కు పడిపోతుండటంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే చలి మరింత తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్ , సంగారెడ్డి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉండటంతో ఈ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు(Temperatures) 5 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక రాజధాని హైదరాబాద్‌తో పాటు వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట ,రంగారెడ్డి జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ఆదివారం నమోదైన గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8.2 డిగ్రీలు నమోదు కాగా, పటాన్‌చెరు (9.0), మెదక్ (9.0) ,రాజేంద్రనగర్ (9.5) ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత తీవ్రంగా ఉంది.
ఈ విపరీతమైన చలి నుంచి కాపాడుకోవడానికి వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి 8 గంటల తర్వాత అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. చలి ప్రభావం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది .
ముఖ్యంగా చిన్నపిల్లలు , వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా మందపాటి ఉన్ని దుస్తులు, మఫ్లర్లు , గ్లౌజులు ధరించాలని సూచిస్తున్నారు. వేడి పానీయాలు తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం మంచిది
హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. ఆదివారం రాత్రి హయత్ నగర్, హకీంపేట్ ప్రాంతాల్లో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత(Temperatures) నమోదు కాగా, శివారు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో నమోదయింది. పొగమంచు వల్ల తెల్లవారుజామున వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి డ్రైవింగ్ చేసేవాళ్లు అప్రమత్తంగా ఉండాలి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో..ఎవరూ అశ్రద్ధ చేయవద్దని అధికారులు కోరుతున్నారు. 2026 న్యూ ఇయర్ వేడుకలకు ప్లాన్ చేసుకునే వారు, ఈ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను సిద్ధం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ముఖ్యమైన జాగ్రత్తలు..రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేవగానే తల, చెవులను కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. గోరువెచ్చని నీటిని మాత్రమే తాగుతూ.. తాజాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గదుల్లో హీటర్లు వాడుతున్నప్పుడు గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి (కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదం రాకుండా). అలాగే చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి.
