Book Fair :కిండిల్ యుగంలోనూ పుస్తక జాతరకు తగ్గని క్రేజ్ .. మీరు మిస్ అవ్వకూడని 10 ప్రత్యేకమైన స్టాల్స్

Book Fair : ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముక్కుకు తగిలే ఆ కొత్త పుస్తకాల సువాసన ఇచ్చే కిక్కు ముందు ఏ డిజిటల్ డివైజ్ కూడా సాటిరాదంటారు బుక్ లవర్స్.

Book Fair

హైదరాబాద్ సిటీలో చలి గాలులు మొదలయ్యాయంటే చాలు, పుస్తక ప్రియుల మనసు ఎన్టీఆర్ స్టేడియం వైపు లాగుతుంది. 10 రోజులు మాత్రమే ఉండే పుస్తకాల జాతర(Book Fair)కు వీలయినన్ని సార్లు వెళ్లి పులికించి పోవడానికి తనువు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. 1985 లో మొదలైన పుస్తకాల జాతర (Book Fair)ఇప్పుడు ఒక సాంస్కృతిక పండుగలా మారిపోయింది.

నిజానికి ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు, వేల పుస్తకాలు పీడీఎఫ్ రూపంలోనో, కిండిల్ వెర్షన్ లోనో మన కళ్లముందు ఉంటాయి. కానీ, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముక్కుకు తగిలే ఆ కొత్త పుస్తకాల సువాసన ఇచ్చే కిక్కు ముందు ఏ డిజిటల్ డివైజ్ కూడా సాటిరాదంటారు బుక్ లవర్స్.

అంతేకాదు పుస్తక ప్రేమికులకు మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ కూడా ఉంటుంది ఇక్కడ. అదేంటంటే కొత్త పుస్తకం సువాసన, ఆ అక్షరాల క్రమం, చేతికి తగిలే ఆ పేజీల స్పర్శ.. ఇవే పాఠకులను బుక్ ఫెయిర్(Book Fair) కు ఎడిక్ట్ అయ్యేలా చేస్తాయి. ఆ భావోద్వేగమే ఈ డిజిటల్ యుగంలోనూ పుస్తక జాతరను కిక్కిరిసేలా చేస్తోంది.

డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29 వరకు జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్ (Book Fair)మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రియులతో కళకళలాడుతుంది. అయితే ఈసారి బుక్ ఫెయిర్‌లో 10 ప్రత్యేకమైన ప్లేసులు కొన్ని ఉన్నాయని అవి మీరు అస్సలు మిస్ అవ్వకూడదని బుక్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు చెబుతున్నారు. అవి..

Book Fair

1. నవోదయ, ఆది శంకర్ బుక్స్ (తెలుగు సాహిత్యం)..తెలుగు సాహితీ సౌరభం ఇక్కడ విరబూస్తుంది. కథలు, నవలలు, ఆధునిక రచయితల సరికొత్త ఎడిషన్లు ఇక్కడ కొలువుదీరాయి. అదృష్టం బాగుంటే మీకు ఇష్టమైన రచయితలు కూడా అక్కడే కనిపిస్తారు, వారి నుంచి ఆటోగ్రాఫ్ తీసుకునే అరుదైన అవకాశం కూడా ఉంటుంది.

2. ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్..తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను ఆకట్టుకునేలా విశ్లేషించే పుస్తకాలకు ఇది కేరాఫ్ అడ్రస్. ప్రముఖ రాజకీయ నేతల బయోగ్రఫీలు, చారిత్రక ఘటనల వెనుక ఉన్న నిగూఢ సత్యాలను చదవాలనుకునే వారు ఈ స్టాల్ ను అస్సలు వదలరు.

3. విశాలాంధ్ర స్టాల్..పాత కాలపు క్లాసిక్ నవలల నుంచి నేటి తరం సరికొత్త రచనల వరకు కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా పిల్లల కోసం రూపొందించిన ‘తెలుగు లెజెండ్స్’ సిరీస్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

4. పోటీ పరీక్షల బ్లాక్స్ (UPSC & Competitive).. యువతతో ఈ స్టాల్స్ కిక్కిరిసిపోతున్నాయి. ఆధునిక పబ్లికేషన్స్, సుదర్శన్ వంటి స్టాల్స్ లో సివిల్స్, గ్రూప్స్ కు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తాజా కరెంట్ అఫైర్స్ గైడ్లు అందుబాటులో ఉన్నాయి.

5. సెకండ్ హ్యాండ్ పుస్తకాల వీధి – బుక్ ఫెయిర్ హృదయం.. చాలామందికి ఇది ఫేవరెట్ స్పాట్. ఎక్కడో మూలన పడి ఉన్న అరుదైన అవుట్ ఆఫ్ ప్రింట్ పుస్తకాలు ఇక్కడే తక్కువ ధరకే లభిస్తాయి. వంద రూపాయలకే రెండు మూడు నవలలు కొనేసి సంచి నింపుకోవచ్చు. 1980ల నాటి పాత కవితా సంపుటాలు వెతికే వారికి ఇది ఒక నిధి అని చెప్పొచ్చు.

6. చిన్నారుల మాయా ప్రపంచం (పిల్లల జోన్)..సెల్‌ఫోన్ గేములకు దూరంగా పిల్లలను పుస్తకాల వైపు మళ్లించడానికి ఇదొక గొప్ప వేదిక. బొమ్మలతో కూడిన ఫెయిరీ టేల్స్, ఆలోచింపజేసే థింకింగ్ గేమ్స్ ఇక్కడ కొలువుదీరాయి.

7. ఉర్దూ , హిందీ గ్యాలరీ.. హైదరాబాద్ అంటేనే గంగా-జమునా తెహజీబ్. ఆ సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. గజల్ సంపుటాలు, ఉర్దూ క్లాసిక్ సాహిత్యం కోసం జనం క్యూ కడుతున్నారు.

8. ట్రావెల్, ఆర్ట్ , ఫోటోగ్రఫీ..ప్రపంచం చుట్టి రావాలని కలలు కనే వారి కోసం ట్రావెల్ గైడ్స్, ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ‘హైదరాబాద్ ఇన్ ఫ్రేమ్స్’ వంటి ఫోటో బుక్స్ ఇక్కడ కనువిందు చేస్తున్నాయి.

9. కల్చరల్ స్టేజ్..స్టాల్స్ మధ్య తిరుగుతూ అలిసిపోయిన వారికి ఇక్కడి కవి సమ్మేళనాలు, రచయితల ముఖాముఖి కార్యక్రమాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆ సాహిత్య చర్చిలను వింటూ పుస్తకాలను వెతకడం ఒక అందమైన అనుభవం.

10. చిన్న పబ్లిషర్లు – కొత్త కలాలకు వేదిక..తేజ, సిరి వెలుగు వంటి మైక్రో పబ్లిషర్లు కొత్త రచయితలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ చిన్న స్టాల్స్ లో మనం ఎప్పుడూ వినని కొత్త ప్రయోగాలు, అద్భుతమైన కథలు కనిపిస్తాయి.

డిజిటల్ యుగంలోనూ ఈ పుస్తక పిచ్చి ఎందుకు అని ప్రశ్నిస్తున్నవారికి ఒక సమాధానం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. పుస్తకం అంటే కేవలం కాగితాల కట్ట కాదు, అదొక ఎమోషన్. పేజీ మడత పెట్టడం, పాత పుస్తకం సువాసన చూడటం, ఆ పుస్తకం చదివాక చివరలో వాటి మీద ఉన్న సిరా చారలను గమనించడం.. ఇవన్నీ మనిషికి, పుస్తకానికి మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని గుర్తు చేస్తాయి. సెల్ ఫోన్ స్క్రీన్ కు బదులుగా పుస్తకాన్ని చేత్తో పట్టుకుని చదవడం అనేది ఒక రకమైన ‘డిజిటల్ డీటాక్స్’ అని చెప్పొచ్చు.

మనుషుల కథలు, జ్ఞానం, చరిత్ర అన్నీ ఒక్కచోట దొరికే ఈ పుస్తక జాతరను ఒక్కసారైనా సందర్శించి తీరాల్సిందే. పుస్తకాల సంచులు మోసుకుంటూ స్టేడియం బయటకు వస్తున్న జనాన్ని చూస్తుంటే.. అక్షరం ఎప్పటికీ చావదు అన్న మధురమైన అనుభూతిని మనసు నిండా మోసుకురావాల్సిందే.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version