Harish
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సినిమా టికెట్ ధరలు కేవలం వినోదానికి సంబంధించిన అంశంగా మాత్రమే కాదు.. ఇప్పుడది ఒక పెద్ద పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌లా మారిపోయింది. మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి.
సచివాలయంలో ఒక రాజ్యాంగేతర శక్తి చక్రం తిప్పుతోందన్న హరీష్ (Harish)..ఆ వ్యక్తి కనుసన్నల్లోనే సినిమా టికెట్ల రేట్లు మారుతున్నాయని బాంబు పేల్చారు. అయితే ఆ కనిపించని శక్తి ఎవరో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడైన రోహిన్ రెడ్డి అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అసలు ఎవరీ రోహిన్ రెడ్డి? ఆయన నేపథ్యం ఏంటి? అన్న ప్రశ్నలు ఎదరవుతున్నాయి. డాక్టర్ రోహిన్ రెడ్డి వృత్తిరీత్యా డెంటిస్ట్. రాజకీయాల్లో ఆయన ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రోహిన్ రెడ్డి, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy)ఉన్న సుదీర్ఘ అనుబంధం వల్ల రోహిన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రోహిన్ రెడ్డి.. ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవి లేకపోయినా..సీఎంవోలో , కీలక శాఖల్లో ఆయన మాటే వేదమని ప్రతిపక్షమే కాదు స్వపక్షం కూడా ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఎందుకంటే మంత్రికి తెలియకుండానే జీవోలు రావటంతో సచివాలయంలో ఏం జరుగుతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఈ టికెట్ ధరల వ్యవహారమే ఇప్పుడు అగ్గి రాజేసింది.
రాజాసాబ్ వంటి పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపు ఫైళ్లు అసలు తన వద్దకు రాలేదని, తనకు తెలియకుండానే అర్థరాత్రి వేళల్లో జీవోలు ఎలా వస్తున్నాయని శనివారం మంత్రి స్వయంగా విస్మయం వ్యక్తం చేయడంతో అంతా ఉలిక్కి పడ్డారు.
అయితే తాజాగా దీని వెనుక రోహిన్ రెడ్డి ఉన్నారని, నిర్మాతలు నేరుగా అతని ద్వారానే పనులు చక్కబెట్టుకుంటున్నారని హరీష్ (Harish) రావు ఆరోపిస్తున్నారు. టికెట్ పెంపు అనుమతుల కోసం కోట్ల రూపాయల కమీషన్ల దందా నడుస్తోందని, ఒక్కో సినిమాకు భారీగా వసూళ్లు జరుగుతున్నాయని హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సినీ పరిశ్రమకు ఇలాంటి ఇబ్బందులు లేవని హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ గారు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూసి ఆదరించారని, అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలు ఆస్కార్ స్థాయికి వెళ్లాయని ఆయన ఆ క్రెడిట్ తమ వల్లే అంటూ చెప్పుకొచ్చారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా వాళ్లను తమ రాజకీయ కక్షలకు వాడుకుంటోందని, నచ్చిన హీరోలకు రెడ్ కార్పెట్ వేస్తున్న రేవంత్ సర్కార్.. నచ్చని వారిపై వివక్ష చూపిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో జరుగుతున్న ఈ రేట్ల పెంపు నిర్ణయాల వల్ల సామాన్యుడు థియేటర్ కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని హరీష్(Harish) ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా తెరవెనుక నడిపిస్తున్న రోహిన్ వల్లేనంటూ ఇన్‌డైరక్ట్ హింట్‌లు ఇచ్చారు.
అంతేకాదు ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి ..సమాంతర ప్రభుత్వాన్ని నడపడం రాజ్యాంగ విరుద్ధమని హరీశ్ రావు పాయింట్ లేపారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా ఒక పక్క సామాన్యుల నుంచి టికెట్ల రూపంలో సొమ్ము వసూలు చేయడంతో పాటు, మరోపక్క ఆ సొమ్ములో కొంత భాగం కమీషన్ల రూపంలో అధికార పార్టీ నేతలకు వెళ్తోందనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ.అయితే రానున్న రోజుల్లో ఈ కనిపించని శక్తికి సంబంధించిన మరిన్ని ఆధారాలను బయటపెడతామని హరీష్ రావు హెచ్చరించడమే..ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించేలా చేశాయి.
Japanese:జపనీస్ సమురాయ్ వంశంలో పవన్ కళ్యాణ్‌కు చోటు.. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా అయ్యారు?
