Valmiki
మహర్షి వాల్మీకి జీవితం అనన్యసామాన్యమైనది. పాపపుణ్యాల మధ్య ప్రయాణించి, తనను తాను శుద్ధి చేసుకుని, మానవజాతికి మొట్టమొదటి కావ్యమైన రామాయణాన్ని అందించిన గొప్ప ఋషి ఆయనే. ఈ మహాకావ్యం కేవలం సీతారాముల దివ్య జీవిత చరిత్ర మాత్రమే కాదు.. ఆ కాలంలోని భారతీయ సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, ఉత్తమ నడవడికలు,ఆచార వ్యవహారాలను కూడా అద్దం పట్టి చూపింది.
వాల్మీకి (Valmiki)పూర్వాశ్రమంలో పేరు రత్నాకర్. ఆయన బాటసారులపై దోపిడీ చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. ఒక రోజు నారదమహర్షి ఆయనకు ఎదురై, ఒక ప్రశ్న వేశారు. “ఈ పాపాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా?” అని. ఆ ఒక్క ప్రశ్న రత్నాకర్ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఇంటికి వెళ్లి భార్యను, పిల్లలను అడగ్గా, వారు ఆ పాపభారాన్ని తాము మోయలేమని నిరాకరించారు. ఆ నిరాకరణతో రత్నాకర్ ఆత్మజాగృతి పొంది, తన తప్పును తెలుసుకున్నాడు. తిరిగి నారదుడి ఉపదేశం మేరకు రామనామ జపం చేస్తూ అపారమైన తపస్సులో మునిగిపోయాడు. ఆయన శరీరం చుట్టూ చీమల పుట్టలు (వల్మీకం) కప్పేసినా కదలకుండా తపస్సులో లీనమయ్యాడు. ఆ తపస్సు మహిమతో ఆయనకు వాల్మీకి అనే పేరు లభించింది.
తరువాత, వాల్మీకి(Valmiki) మహర్షి తన ఆశ్రమవాసంలో శ్రీరాముడిని అరణ్యంలో కలుసుకున్నారు. రాముడు, సీతమ్మను వనవాసానికి పంపినప్పుడు, ఆమె వాల్మీకాశ్రమంలోనే నివసించింది. అక్కడే రామచంద్రుని కుమారులు లవ–కుశులు జన్మించారు. వారిద్దరూ వాల్మీకిని గురువుగా స్వీకరించి, సకల విద్యలతో పాటు రామాయణాన్ని కూడా అభ్యసించారు. వాల్మీకి మహర్షి కేవలం రామాయణమే కాదు, యోగవాశిష్టం అనే గంభీర గ్రంథాన్ని కూడా రచించారు. రామునికి వశిష్టుడు చెప్పిన యోగా–ధ్యాన తత్వాలను లోతుగా ఇందులో వివరించారు. అంతేకాక ఆదిత్యహృదయం, కౌసల్యా సుప్రజా రామ వంటి పవిత్ర స్తోత్రాలు, సుప్రభాతములు కూడా ఆయనే రచించారని చెబుతారు.
24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతీయ ధర్మం, సంస్కృతి, కుటుంబ నడవడికలు, సంబంధ బాంధవ్యాలపై ఒక అజరామరమైన ప్రభావాన్ని చూపింది. తండ్రీ–కొడుకు, భార్య–భర్తలు, అన్నదమ్ములు, రాజు–ప్రజలు వంటి ప్రతి సంబంధానికి ఈ కావ్యం ఆదర్శ ప్రమాణాలను నెలకొల్పింది. అందుకే పండితులు వాల్మీకిని “కవికోకిల” అని వర్ణించారు: “కూజంతం రామ రామేతి మధురమ్ మధురాక్షరమ్ | ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥” అంటే, కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, మధురమైన రామనామాన్ని పాడే కోకిలగా ఆయనను కీర్తించారు.
రామాయణం సమయగమనంలో అనేక మార్పులు ఎదుర్కొన్నా, వాల్మీకి(Valmiki) మహర్షి రాసిన అసలు కావ్యం నేటికీ ఆదికావ్యంగా నిలిచింది. పాశ్చాత్యులు దీన్ని క్రీపూ 500లో రచించారని నమ్మినా, భారతీయ దార్శనికులు మాత్రం లక్ష సంవత్సరాల ప్రాచీనమని విశ్వసిస్తారు. వాల్మీకి మహర్షి మనకు అందించింది కేవలం ఒక గ్రంథం కాదు, ఆదర్శ జీవనానికి ఒక శాశ్వత ప్రమాణం. ఈ మహనీయుని జన్మదినం (07-10-2025, మంగళవారం) సందర్భంగా ఆయనను స్మరించుకుందాం. వందనం ఆదికవికి — వందనం వాల్మీకికి.
