ED : ఈడీ ముందుకు రానా.. ఏం చెప్పారు?

ED : అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి రానాను ఈడీ ఆగస్టు 11న హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారించింది.

ED

సినిమా తారలు, సెలబ్రిటీలు అంటే మనందరికీ ఆదర్శం. కానీ వారు ప్రమోట్ చేసే కొన్ని యాప్స్‌తో సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో దర్యాప్తును వేగవంతం చేయడంతో, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, టీవీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 29 మందిని విచారించగా, తాజాగా ప్రముఖ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)ఈడీ ముందు హాజరయ్యారు.

అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి రానాను ఈడీ (ED)ఆగస్టు 11న హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారించింది. ఆయన ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొదట ఆగస్టు 23న హాజరు కావాలని నోటీసులు వచ్చినా, షూటింగ్ షెడ్యూల్ కారణంగా రానా విజ్ఞప్తి చేయడంతో తేదీని మార్చారు.

ఈ కేసులో నటి మంచు లక్ష్మి( Manchu Lakshmi)ని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడీ(ED)నోటీసులు పంపింది.

ఈడీ విచారణలో ఇప్పటికే ప్రకాష్ రాజ్ కీలక విషయాలు వెల్లడించారు. తాను 2016లో ఒక బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశానని, అయితే ఆత్మవిమర్శతో 2017లో ఆ ప్రమోషన్‌ను ఆపేశానని తెలిపారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. తాను ప్రమోట్ చేసింది చట్టబద్ధమైన, స్కిల్-బేస్డ్ గేమింగ్ యాప్ కోసమేనని స్పష్టం చేశారు.

నాలుగు రాష్ట్రాల పోలీస్ నివేదికల ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును మొదలుపెట్టింది. జుంగ్లీ రమ్మీ, A23, జీత్‌విన్, పారిమాచ్, లోటస్365 వంటి బెట్టింగ్ యాప్‌ల ద్వారా భారీ స్థాయిలో మనీలాండరింగ్, పన్ను మోసాలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. మొత్తం ఐదు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి, పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు, వారి ఆర్థిక లావాదేవీలపై సాంకేతిక విచారణలు జరుపుతోంది. ఈ కేసులో ఇంకా చాలామంది ప్రముఖులను విచారించే అవకాశం ఉంది.

ED

ఈ మోసపూరిత యాప్‌ల వల్ల సమాజంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈడీ అంచనా ప్రకారం, మోసాలకు గురై 3 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని దురదృష్టకర సందర్భాల్లో, ఆర్థిక ఒత్తిడి కారణంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈడీ దర్యాప్తు ప్రజలకు భరోసా కల్పిస్తోంది.

ఈ కేసు విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరైన సెలబ్రిటీలు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ, ఈడీ ఇంకా మనీలాండరింగ్ కోణంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతోంది. భవిష్యత్తులో ఇలాంటి మోసపూరిత యాప్‌ల నుంచి వినియోగదారులను కాపాడటానికి ప్రభుత్వాలు, సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ కేసు హెచ్చరిస్తోంది.

Exit mobile version