Family Week : ఫ్యామిలీ వీక్‌లో కన్నీళ్లు, సర్‌ప్రైజ్‌లు.. బిగ్ బాస్ హౌస్‌లో ఫస్ట్ టైమ్‌ ఎంగేజ్మెంట్ ఈవెంట్..

Family Week : బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ జోష్ కొనసాగుతోంది. ముకేష్, అమన్ ఎమోషనల్ సర్‌ప్రైజ్‌లతో పాటు, శివ్, ప్రియాంక జైన్ ఎంగేజ్‌మెంట్ జరగడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.

Family Week

ఎప్పుడూ వార్‌లు, వార్నింగ్‌లతో హీటెక్కిపోయే బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఎమోషన్స్, సర్‌ప్రైజెస్‌తో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఫ్యామిలీ వీక్(Family Week) జోరు కంటెన్యూ కావడంతో కంటెస్టెంట్ల కళ్లలో ఆనందబాష్పాలు సునామీలా ముంచెత్తుతున్నాయి. మొన్నటివరకు గేమ్స్, డ్రామాలతో హోరెత్తిన హౌస్, ఇప్పుడు ప్రియమైన వాళ్ల రాకతో పూర్తిగా ఎమోషనల్ జోన్‌లోకి వెళ్లిపోయింది.

ముందు రోజు ఎపిసోడ్‌లో నరేష్, వంశీ, శ్వేతా ఫ్యామిలీలు సందడి చేయగా, BB స్కూల్ టాస్క్‌లో నరేష్, రామ్‌ప్రసాద్‌ల కామెడీ షో నవ్వులు పూయించింది. ఇక బుధవారం జరిగిన ఎపిసోడ్ మాత్రం కేవలం గేమ్‌ మాత్రమే కాకుండా, కంటెస్టెంట్ల మధ్య ఉన్న బంధాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించింది.

ఉదయాన్నే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముకేష్ తల్లిని చూసి అక్కడున్నవారంతా భావోద్వేగానికి లోనయ్యారు. కొడుకును హత్తుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి స్క్రీన్ ముందున్న ఆడియెన్స్ కూడా కంటతడి పెట్టారేమో అన్పించేంత ఎమోషనల్‌గా సాగింది. అందరినీ పేరుపేరునా పరిచయం చేసిన ముకేష్ తర్వాత అమ్మతో మాట్లాడాడు. కోపం తగ్గించుకోవాలని అతని తల్లి ముకేష్‌కు అడ్వైజ్ ఇచ్చారు.

ఈ ఎమోషనల్ మూమెంట్‌లో వర్షిణి కూడా ముకేష్ మదర్‌తో కలిసి బాగా క్లోజ్ అయిపోయింది. ముకేష్, వర్షిణి ఇద్దరూ కలిసి ఆమె ఒళ్లో పడుకుని ఏడ్చిన సీన్ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. సుధీర్‌తో మాట్లాడిన ముకేష్ మదర్ .. మీరిద్దరూ అన్నదమ్ముల లాంటివాళ్లని, చిన్నచిన్న విషయాలకు గొడవ పడొద్దని చెప్పిన మాటలు అందరి మనసులను హత్తుకున్నాయి. ఇదంతా చూస్తున్న త్రిగుణ్‌కు తన అమ్మ గుర్తుకువచ్చి చిన్నపిల్లాడిలా ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను కదిలించింది.

ఆ తర్వాత బిగ్ బాస్ స్కూల్ టాస్క్‌లో భాగంగా తెలుగు సరిగా రాని దేబ్జానీ తెలుగు టీచర్‌గా ఎంట్రీ ఇచ్చి కాసేపు నవ్వులను పంచింది. టంగ్ ట్విస్టర్స్‌తో కంటెస్టెంట్లను బాగానే ఆటపట్టించింది. ఆ వెంటనే అమన్ ఫాదర్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ..అమన్ పరుగున వెళ్లి హగ్ చేసుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇంట్లోని అందరితో కూడా కలివిడిగా మాట్లాడిన ఆయన, వెళ్లేటప్పుడు ఎమోషనల్ అవడం చూసేవారికి గుండెల్ని పిండేసేలా అనిపించింది.

ఇక అసలు సిసలైన ఊహించని ట్విస్ట్ శివ్ ఫ్యామిలీ ఎంట్రీతో మొదలైంది. శివ్‌కు కాబోయే భార్య, టెలివిజన్ నటి ప్రియాంక జైన్ హౌస్‌లోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే శివ్ పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుని ఏడ్చేశాడు. శివ్‌ కోసం స్పెషల్‌గా కొత్త డ్రెస్ తీసుకువచ్చిన ప్రియాంక ..బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడూ జరగని విధంగా మనం ఎంగేజ్మెంట్ చేసుకుందామంటూ ఆమె బాంబ్ పేల్చింది. దీనికి బిగ్ బాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హౌస్ మొత్తం పెళ్లి మండపాన్ని తలపించేలా.. ఇంట్లోని మెంబర్స్ అందరూ డ్రెస్సులు మార్చుకుని ఈ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు.

ప్రియాంక గురించి శివ్ మాట్లాడుతూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంతో రొమాంటిక్ వైబ్స్‌తో నిండిపోయింది. ఇద్దరూ మోకాళ్ల మీద కూర్చొని ఒకరికొకరు రింగ్స్ తొడుక్కొని ..ఆ తర్వాత దండలు మార్చుకుని హౌస్‌మేట్స్‌ను మరింత హుషారు చేశారు. మిగతా కంటెస్టెంట్లు ఇద్దరినీ ఎత్తుకుని గాల్లోకి లేపుతూ డ్యాన్సులతో హోరెత్తించారు. పెళ్లి పాటలకు అందరూ స్టెప్పులేసి ఆ వేడుకను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.

సెలబ్రేషన్స్ ముగిసాక ప్రియాంక అందరూ కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని, మీ మాటలతో ఎదుటివాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవాలంటూ సలహా ఇచ్చింది. శివ్ మదర్ మాట్లాడిన వీడియో బైట్ చూపించిన తర్వాత హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. మొత్తానికి ఫ్యామిలీ వీక్(Family Week) మొదటి 2 డేస్ నవ్వులు, కన్నీళ్లు, సర్‌ప్రైజ్‌లతో ఆడియెన్స్‌కి ఫుల్ మీల్స్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. గురువారం ఎవర ఫ్యామిలీలు రాబోతున్నాయనే క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ పెరిగిపోయింది.

Diabetes Day : సైలెంట్ కిల్లర్ డయాబెటిస్.. దేశంలో 43 శాతం మందికి తెలీకుండానే మధుమేహం

↑
Exit mobile version